ASBL Koncept Ambience

ఐటీ, వ్యవసాయరంగంలో భారీగా పెట్టుబడులు : చంద్రబాబు

ఐటీ, వ్యవసాయరంగంలో భారీగా పెట్టుబడులు : చంద్రబాబు

మూడు దేశాలు 7 నగరాలు. 9 రోజులు 50కి పైగా ముఖాముఖి చర్చలు. 800 మందికి పైగా సీఈవోలు, పారిశ్రామికవేత్తలతో భేటీలు. 5 ముఖ్యమైన ఎంవోయూలు 75కు పైగా లెటర్‌ ఆఫ్‌ ఇండెక్స్‌. 65 వేల కోట్ల పెట్టుబడులు (10 బిలియన్‌ డాలర్లు) 50 వేలకు పైగా ఉద్యోగావకాశాలు. ఇదీ నా విదేశీ పర్యటన ఫలం అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గతంలో విదేశీపర్యటనలకు వెళ్లినప్పుడు ఐటీ రంగంలో పెట్టుబడుల కోసం ప్రయత్నించేవాడనని, ఈసారి వ్యవసాయరంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు కృషి చేశామని తెలిపారు. వ్వవసాయ దిగుబడులు పెరగాలని, సాగును లాభసాటిగా మార్చాలని, ఇది జరగాలంటే వ్యవసాయరంగాన్ని సాంకేతికతతో అనుసంధానించాలని పేర్కొన్నారు. తొమ్మిది రోజుల విదేశీ పర్యటనలో సాగుకు అత్యతం ప్రాధాన్యం ఇచ్చాను. దీపావళి రోజున విదేశాల్లోని వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించడం నా జీవితంలో మరచిపోలేని మధురస్మృతి అని పేర్కొన్నారు.  హార్టీకల్చర్‌, పుడ్‌ ప్రాసెసింగ్‌లో మనం స్వయం సమృద్ధిని సాధించాలి. దేశపు ఆహారపు అవసరాలను మన రాష్ట్రం తీర్చగలగాలి అని పేర్కొన్నారు.

వ్యవసాయరంగాన్ని సాంకేతికబాట పట్టించాలన్న తన ఆలోచనకు అమెరికా పర్యటన మార్గం చూపిందని పేర్కొన్నారు. లండన్‌ పర్యటలో ప్రతిష్ఠాత్మక గోల్డెన్‌ పీకాక్‌ అవార్డు అందుకోవడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఇదీ ఏపీ ప్రభుత్వ యంత్రాంగం చేసిన కృషికి దక్కిన ఫలమన్నారు.  విదేశీ పర్యటనలో పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించగలిగామన్నారు. దుబాయిలోని రెండు పెద్ద గ్రూపులతో ఒప్పందాలు జరిగాయని, ఈ రెండు ఒప్పందాల విలువ 7.5 బిలియన్‌ డాలర్లని చెప్పారు. దుబాయ్‌కు చెందిన దిగ్గజ సంస్థ ఏవియేషన్‌ సిటీ ఎల్‌ఎల్‌పేతో కుదిరిన ఒప్పందం మేరకు రాష్ట్రంలో ఏరో సిటీని ఆ సంస్థ నిర్మిస్తుందన్నారు. ఏరోసిటీ ద్వారా 15వేల మందికి ప్రత్యక్షంగా ఐదువేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. రెండో ఒప్పందం బిన్‌ జాయేద్‌ గ్రూప్‌తో కుదిరిందన్నారు. ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతుల రంగంలో 2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెడుతుందన్నారు. కువైత్‌కు చెందిన అల్‌ అర్ఫాజ్‌ గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీతో ఏపీఈడీబీ రెండు ఎంఓయూలు కుదుర్చుకుందని, అందులో భాగంగా ఏపీలో అల్‌ ఆర్పాజ్‌ హోల్డింగ్‌ కంపెనీ ఎల్‌ఎన్‌జీ టెర్నినల్‌, గ్రీన్‌ ఫీల్డ్‌ క్రూడాయిల్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంపెక్స్‌ నెలకొల్పుతుందని అన్నారు.

అమెరికాకు చెందిన 60కి పైగా సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయన్నారు. ఏపీలో ఐటీ పరిశ్రమలను స్థాపించేందుకు 500 మంది ప్రవాస భారతీయులు ఆసక్తిగా ఉన్నారని అన్నారు. ఈడీబీతో 100 అవగాహన ఒప్పందాలకు సంసిద్ధత తెలిపారని, 60 కంపెనీలు వెనువెంటనే విశాఖలో కార్యాలయాలు తెరిచేందుకు సిద్ధమయ్యాయని, వీటి వల్ల 8000 మందికి ప్రత్యక్షంగా 20000 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. కర్నూలు మెగా సీడ్‌ పార్కులో భాగస్వామ్యం అయ్యేందుకు పయనర్‌ సంస్థ ఆసక్తి చూపిందన్నారు. లండన్‌లో నేచురల్‌ స్వీట్‌నర్ల తయారీలో పేరొందిన వ్యూర్‌ సర్కిల్‌ ఏపీలో సెట్వియూ తోటల సాగుకు అంగీకారం తెలిపిందని చెప్పారు.

Tags :