ASBL Koncept Ambience

తెలంగాణలో కెమ్ వేద పెట్టుబడులు

తెలంగాణలో కెమ్ వేద పెట్టుబడులు

తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకుగాను మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీ కెమ్‌ వేద ముందుకు వచ్చింది. శాండియాగోలోని సంస్థ కార్యాలయంలో కేటీఆర్‌తో జరిగిన సమావేశంలో కెమ్‌ వేద ఈ మేరకు ప్రకటన చేసింది. లైఫ్‌సైన్సెస్‌ రంగంలో ప్రముఖ పరిశోధన సంస్థగా కెమ్‌ వేదకు పేరుంది. ఫార్మాసూటికల్‌, బయోటెక్నాలజీ, ఆగ్రో కెమికల్‌ పరిశ్రమలకు ఈ సంస్థ సేవలందిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మరింతగా విస్తరించేందుకు 150 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నట్లు సంస్థ తెలిపింది. కేవలం 45 మంది ఉద్యోగులతో ప్రారంభమైన కంపెనీ ప్రస్తుతం ఈ సంఖ్య 450కిచేరిందని దీనిని మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని కంపెనీ ప్రతినిధులు కేటీఆర్‌కు తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 8 ఎకరాల్లో రెండు చోట్ల తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, తమ కంపెనీని ఇంత భారీగా విస్తరించేందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాలసీలు, నాణ్యమైన మానవ వనరులు ప్రధాన కారణాలని తెలిపారు. హైదరాబాద్‌ నగరం దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా ఉందని కేటీఆర్‌ ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు నిర్ణయించిన కెమ్‌ వేద లైఫ్‌ సైన్సెస్‌కు ఈ సందర్భంగా మంత్రి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో ఫార్మా లైఫ్‌సైన్సెస్‌ ఈకోసిస్టంలో ఉన్న మానవ వనరులు, అవకాశాలను ఉపయోగించుకుని ప్రత్యేకంగా ఆర్‌అండ్‌డీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడం పట్ల కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.  కంపెనీ కార్యకలాపాలకు ప్రభుత్వం తరపున సంపూర్ణ మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌ ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌ రీసెర్చ్‌ ఈకో సిస్టంను డెవలప్‌మెంట్‌ మరింత బలోపేతం చేస్తుందని కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో తమ కంపెనీ వేగంగా విస్తరిస్తున్నదని, అక్కడి ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌ వృద్ధిలో భాగస్వాములమవడం తమకు అత్యంత సంతోషాన్నిస్తోందని కెమ్‌ వేద కంపెనీ ప్రెసిడెంట్‌, సీఈవో బీమారావు పారసెల్లి తెలిపారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఆర్‌అండ్‌డీ సెంటర్‌ వల్ల అత్యంత నైపుణ్యం కలిగిన 500 మంది హై స్కిల్డ్‌ పరిశోధన నిపుణులకు అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ తో పాటు పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తి నాగప్పన్‌ పాల్గొన్నారు.

 

Tags :