ASBL Koncept Ambience

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన విజయవంతం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన విజయవంతం

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులకోసం, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించడం కోసం అమెరికాకు ఆగస్టు 4 నుంచి 9వరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితోపాటు, మంత్రులు శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి వెంకట రెడ్డి సీనియర్‌ అధికారుల బృందం అమెరికాకు వచ్చింది. శ్రీమతి శాంత కుమారి, చీఫ్‌ సెక్రటరీ, ఐటి అండ్‌ సి డిపార్ట్‌మెంట్‌, పరిశ్రమలను కూడా చూసుకునే ఐఎఎస్‌ అధికారి జయేష్‌ రంజన్‌,  ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ ఎన్నారై వ్యవహారాల ఐఎఫ్‌ఎస్‌ అధికారి డా. ఇ. విష్ణువర్ధన్‌ రెడ్డి, టీజీఐఐసీ సీఈవో మధుసూదన్‌ తదితరుల బృందం సిఎం వెంట అమెరికా వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా వివిధ నగరాల్లో పర్యటించి అక్కడ ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలతో, ఎన్నారైలతో సమావేశమై తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరించి వారిని ఒప్పించి పెట్టుబడులు పెట్టించేలా చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్‌ బృందం సక్సెస్‌ అయింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఆయన బృందానికి న్యూయార్క్‌, న్యూజెర్సి, వాషింగ్టన్‌ డీసీ, డల్లాస్‌, కాలిఫోర్నియాలలో ఆయన అభిమానులు ఘనంగా స్వాగతం పలకడం, న్యూయార్క్‌లోని టైమ్‌ స్క్వేర్‌పై రేవంత్‌ రెడ్డి ఫోటోలను ప్రదర్శించడం అమెరికాలో ఆయనకు ఉన్న క్రేజీని తెలియజేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఆయన బృందం చూపిన చొరవతో చాలామంది పెట్టుబడిదారులు తెలంగాణలో పెట్టుబడులను పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఎన్నో అంతర్జాతీయ సంస్థలు ఇందులో ఉన్నాయి. అలాగే ముఖ్యమంత్రి తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్యూచర్‌ సిటీపై అందరూ ఆసక్తిగా తెలుసుకోవడం కనిపించింది. ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా సంసిద్ధతను వ్యక్తం చేశారు.

19 అంతర్జాతీయ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అంగీకారం తెలిపాయి. రూ.31,532 కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తద్వారా 30,750 ఉద్యోగాలు రానున్నాయి. అమెరికా వేదికగా సీఎం రేవంత్‌ తెలంగాణను ఫ్యూచర్‌ స్టేట్‌గా ప్రకటించడం, హైదరాబాద్‌లో నాలుగో నగరం అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులను వివరించడంపై మంచి స్పందన లభించింది. కాగా, అమెరికా పర్యటనపై ముఖ్యమంత్రి రేవంత్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచంలో పేరొందిన కంపెనీలతో సంప్రదింపులు, చర్చలతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త భాగస్వామ్యానికి నాంది పలికిందన్నారు.  స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సిటీ నుంచి ఫ్యూచర్‌ సిటీ నిర్మించేందుకు తమ సర్కారు ఎంచుకున్న ప్రణాళికలకు అమెరికా పారిశ్రామికవేత్తల నుంచి భారీ మద్దతు లభించిందని పేర్కొన్నారు. తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా, అభివృద్ధికి దోహదపడేలా ప్రఖ్యాత కంపెనీలు పెట్టుబడులకు ముందుకురావడం శుభసూచకమని తెలిపారు.  

ఏడు రోజుల్లో 50 మందిపైగా వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. కృత్రిమ మేధ, ఫార్మా-ల్కెఫ్‌ సైన్సెస్‌, విద్యుత్తు వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ ఎలక్టాన్రిక్‌ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి కంపెనీలు అసక్తి చూపించాయి. కాగ్నిజెంట్‌, చార్లెస్‌ స్క్వాబ్‌, ఆర్సీసీఎం కార్నింగ్‌, అమెజాన్‌, జొయిటిస్‌, హెచ్‌సీఏ హెల్త్‌ కేర్‌, వివింట్‌ ఫార్మా, థర్మో ఫిసర్‌, ఆరమ్‌ ఈక్విటీ, ట్క్రెజిన్‌ టెక్నాలజీస్‌, మోనార్క్‌ ట్రాక్టర్‌ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణ, కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. హైదరాబాద్‌లో డేటా సెంటర్‌ విస్తరణకు అమెజాన్‌ తీసుకున్న నిర్ణయం మైలురాయిగా నిలిచింది. సీఎం బృందం యాపిల్‌, గూగుల్‌, స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ప్రపంచబ్యాంక్‌ ప్రతినిధులతోనూ చర్చలు జరిపింది.

న్యూజెర్సిలో ఎన్నారైలు ఏర్పాటు చేసిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ సమావేశం విజయవంతమైంది. ఎంతోమంది తెలుగు ఎన్నారై ప్రముఖులతోపాటు, ఐఎన్‌ఓసి నాయకులు, కాంగ్రెస్‌ అభిమానులు, రేవంత్‌ మిత్రులు తదితరులు ఈ సమావేశానికి తరలి వచ్చారు. ఈ సమావేశానికి నగరంలో కార్ల ర్యాలీని రేవంత్‌ మిత్రబృందం నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది. అలాగే వాషింగ్టన్‌ డీసీలో కూడా మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 

కాలిఫోర్నియాలో కూడా అన్ని చోట్ల కార్యక్రమాలు విజయవంతం కావడంతో రేవంత్‌ బృందం సంతోషాన్ని వ్యక్తం చేసింది. కాలిఫోర్నియాలో ఇండియన్‌ కాన్సల్‌ జనరల్‌, శాన్‌ ఫ్రాన్సిస్కో శ్రీకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కమ్యూనిటీ మీటింగ్‌ కూడా విజయవంతం అయిందని తెలిపారు.

తెలుగు టైమ్స్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభినందనలు

అమెరికాలో 21 సంవత్సరాలుగా తెలుగు ఎన్నారైలకోసం ప్రత్యేకంగా వెలువడుతున్న ‘తెలుగు టైమ్స్‌’ పత్రికను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభినందించారు. పత్రిక ఎడిటర్‌ చెన్నూరి వెంకట సుబ్బారావు కాలిఫోర్నియాలో ముఖ్యమంత్రిని కలిసినప్పుడు తెలుగుటైమ్స్‌ పత్రికను ఆయనకు చూపించారు. ఈ సందర్భంగా ఆగస్టు 1 ఇస్యూలో రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటన వార్తలను, ఫోటోలను చూసి ప్రశంసించిన రేవంత్‌ రెడ్డికి  అమెరికాలోని ఎన్నారైలకు రెండు దశాబ్దాలుగా మీడియాపరంగా సేవలందిస్తున్న విషయాన్ని సుబ్బారావు చెన్నూరి వివరించారు.  అమెరికాలోని ఎన్నారైలకు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా తెలుగు టైమ్స్‌ పనిచేస్తున్నదని, వివిధ కార్యక్రమాలకు కూడా ఈవెంట్‌ కో ఆర్డినేటర్‌గా తెలుగు టైమ్స్‌ వ్యవహరించిన విషయాన్ని సుబ్బారావు చెన్నూరి తెలియజేశారు. న్యూజెర్సిలో రేవంత్‌ రెడ్డి మీట్‌ అండ్‌ గ్రీట్‌లోనూ, కాలిఫోర్నియాలోనూ తెలుగు టైమ్స్‌ పత్రికను పలువురు చూసి అభినందనలు తెలియజేశారు. 

 

 

Tags :