తానా మహాసభల్లో తారాలోకం.. మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొన్న సినీతారలు
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో తానా మహాసభలు జరుగుతున్నాయి. వీటిలో పాల్గొనేందుకు ప్రముఖ సినీ తారలంతా అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే తానా పెద్దలు, ప్రముఖులు బస చేసిన క్రౌన్ ప్లాజాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లాజాలోని బాల్ రూంలో జరిగిన ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్ చైర్మన్ శ్రీనివాస్ లావు ఆహ్వానం పలికారు. కాన్ఫరెన్స్ కన్వీనర్ రవి పొట్లూరి మాట్లాడుతూ సినీ తారలందరికీ ధన్యవాదాలు తెలిపారు. వీరంతా తానాను తమ సంస్థలాగే భావించి, మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ మహాసభలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు వివరించారు.
ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత, తెలుగు నటులు మురళీ మోహన్ మాట్లాడుతూ ఎన్నారైలు చేస్తున్న సేవలను కొనియాడారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టిన తానాకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో హీరో నిఖిల్, యాంకర్ సుమ, అనసూయ, రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్, సింగర్స్ హేమచంద్ర, కౌసల్య, మనో తదితరులు పాల్గొన్నారు.