ASBL Koncept Ambience

అమరావతికి ‘సిస్కో’

అమరావతికి ‘సిస్కో’

ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో దిగ్గజ సంస్థ ‘సిస్కో’ అమరావతికి రాకపై సానుకూల సంకేతాలు వెలువడ్డాయి. సాధారణంగా రాజకీయ నాయకులు, ఇతర దేశాల ప్రతినిధులను కలవడానికి ఇష్టపడని... సిస్కో అధిపతి జాన్‌ చాంబర్స్‌ సీఎం బృందాన్ని స్వయంగా నివాసానికి ఆహ్వానించారు. అంతేకాదు... ఈ సమావేశంలో మరో 30 కంపెనీల సీఈవోలూ పాల్గొనేలా చూశారు. ఇది నవ్యాంధ్రకు సిస్కో ఇచ్చిన ప్రాధాన్యానికి నిదర్శనమని... అమరావతికి ఆ సంస్థ రావడం ఖాయమని చంద్రబాబు బృందంలోని సభ్యులు తెలిపారు. అమెరికా పర్యటనలో నాలుగోరోజున చంద్రబాబు, ఇతర ప్రతినిధులు శాన్‌హోజెలో పర్యటించారు. సిస్కో వరల్డ్‌ వైడ్‌ హెడ్స్‌ జాన్‌ చాంబర్స్‌, జాన్‌ కెర్న్‌తో సమావేశమయ్యారు. సిస్కో ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ఉన్న జాన్‌ చాంబర్స్‌ నివాసంలోనే ఈ సమావేశం జరిగింది. జాన్‌ చాంబర్స్‌ సీఎం బృందంతో మూడు పర్యాయాలు చర్చలు జరిపారు.

ఈ చర్చలు ఏపీ, భారత్‌ పట్ల మాకు ఉన్న నిబద్ధతకు అద్దం పడుతాయి. వ్యక్తిగతంగా చంద్రబాబు పట్ల నాకు ఉన్న గౌరవానికి సూచిక అని జాన్‌ చాంబర్స్‌ తెలిపారు. ఆధునిక కమ్యూనికేషన్స్‌ వ్యవస్థ ప్రపంచాన్ని ఏవిధంగా అనుసంధానం చేస్తుందో సీఎం బృందానికి సిస్కో ప్రతినిధులు ప్రత్యేక ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సంస్థ ఎగ్జిక్యూటివ్స్‌తో తన బోర్డు రూమ్‌ నుంచే సమావేశమయ్యే విధానాన్ని చాంబర్స్‌ సీఎంకి ప్రదర్శించి చూపారు. సిస్కో కార్యకలాపాలకు అమరావతిని కేంద్రంగా చేసుకోవాలని చాంబర్స్‌ను సీఎం కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. తప్పకుండా అమరావతిలో సిస్కో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు. సీఎం బృందానికి జాన్‌ చాంబర్స్‌ అల్పాహార విందు ఇచ్చారు. సెమీ కండక్టర్‌ చిప్‌ల తయారీలో పేరొందిన అప్లైయిడ్‌ మెటీరియల్స్‌ సంస్థ ప్రతినిధులతో సీఎం బృందం భేటీ అయింది. రాష్ట్రంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వారికి సీఎం ఆహ్వానం పలికారు.


Click here for Photogallery

Tags :