కలుషితం కాని సేద్యమే నేడు అవశ్యం - చంద్రబాబు
వ్యవసాయరంగంలో కలుషితం కాని సేద్యమే నేడు ఉత్తమమని, ఖర్చును తగ్గించి చీడపీడల లేని కాలుష్య రహిత సాగును ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.
ఐక్యరాజ్యసమితి వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు 'సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత...అంతర్జాతీయ సవాళ్లు- అవకాశాలు' అనే అంశంపై ప్రసంగాన్ని కొనసాగించారు. 'అమ్మ జన్మనిస్తే.. భూమాత ఆహారం నుంచి అన్నీ ఇస్తుంది...మనం భూమిని పూర్తిగా కలుషితం చేస్తున్నామని బాబు పేర్కొన్నారు. రసాయన ఎరువులతో పండించిన పంటలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రకృతి వ్యవసాయమే అన్ని సమస్యలకు పరిష్కారమని సీఎం స్పష్టం చేశారు. జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్‌తో పెట్టుబడి తగ్గడమే కాకుండా దిగుబడులు పెరుగుతాయని వివరించారు.
ఐటీ ప్రొఫెషనల్స్ కూడా వ్యవసాయం వైపు చూస్తున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఏపీ కొత్త ఒరవడి సృష్టిస్తోందన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఇప్పటికే లక్షల ఎకరాల్లో సాగయ్యేలా చేయడం, 2029 నాటికి 20 లక్షల ఎకరాలకు ఈ విస్తీర్ణాన్ని పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను కూడా ఆయన అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించారు. ఇప్పటికే దేశంలో ప్రకృతి సేద్యంలో నవ్యాంధ్ర అగ్రగామిగా ఎదిగి సాధిస్తున్న విజయాలను వివరించారు. ప్రకృతి వ్యవసాయానికి రాష్ట్రం కేంద్రంగా మారిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్నపూర్ణ అని పేరు కూడా ఉందని సదస్సులో పేర్కొన్నారు. ఐదేళ్లలో వందశాతం ప్రకృతి వ్యవసాయం అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు.