నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి యు.కె సహకారం
నవ్యాంధ్ర అభివృద్ధి ధ్యేయంగా, స్వర్ణాంధ్ర లక్ష్యంగా ప్రారంభమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీపర్యటన బుధవారం 8వ రోజుకు చేరుకుంది. ఒక వైపు రాజధాని అమరావతి నిర్మాణ ఆకృతుల నమూనాలపై నార్మన్ ఫోస్టర్ బృంద రూపకర్తలతో సమాలోచనలు, మరోవైపు వరుస ముఖాముఖి సమావేశాలతో ముఖ్యమంత్రి బిజీ అయ్యారు. ఈరోజు ఉదయం యుకె మినిస్టర్ (సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్) ప్రీతి పటేల్ లండన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాజధాని నిర్మాణం తదితర అంశాలపై వారు సంభాషించారు. యూకే మన రాష్ట్రానికి ఏఏ రంగాల్లో సహకారం అందివ్వగలదనే విషయంపై ముఖ్యమంత్రి ఆమెతో మాట్లాడారు. ఐరోపా, యూకేలలో ఉన్న అత్యుత్తమ సాంకేతిక విధానాలను అందించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడాలని యూకే మంత్రి ప్రీతి పటేల్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. గతంలో తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఏర్పాటు అంశాలలో యూకే ఎంతో సహకారం అందించిందని చెబుతూ ఆనాటి విషయాలను ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కొత్త రాష్ట్రంలో సవాళ్లను అధిగమిస్తూ, సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతున్నట్లు చంద్రబాబు వివరించారు.
పరిపాలనా సంస్కరణలతో ప్రజలకు మెరుగైన పరిపాలన అందిస్తూ ప్రభుత్వ పథకాల ఫలితాలు వేగంగా వారికి అందేలా కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.
ఇ-ప్రగతి కార్యక్రమాలను ప్రస్తావించారు. అధునాతన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వపరంగా వినియోగించుకుంటున్నట్లు యూకే మంత్రికి వివరించారు. రాష్ట్రంలో డ్రోన్లు, డ్రోన్లు, బిగ్ డేటా, సీసీటీవీ కెమెరాలు, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, స్పెన్సర్లు తదితర ఐటీ, ఐవోటీ విస్తృత వినియోగం గురించి ముఖ్యమంత్రి వివరిస్తున్నప్పుడు ఆమె ఆసక్తిగా విన్నారు. ఆంధ్రప్రదేశ్ సాంకేతిక ప్రగతిని, ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక విధానాలను ప్రశంసించారు. నవ్యాంధ్రప్రదేశ్‌కు అన్నివిధాలా సహకారం అందిస్తామని ప్రీతి పటేల్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు డా పరకాల ప్రభాకర్ తదితరులున్నారు.