రెండో రోజూ వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశాలు
అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు జరిపారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ కంపెనీ ఎం మోసెర్ అసోసియేట్స్ అమరావతి నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. ఆ సంస్థ గ్లోబల్ డైరెక్టర్ రస్సెల్ డ్రింకెర్ ముఖ్యమంత్రితో భేటీలో ఈ విషయం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా తాము చేపట్టిన పనులను ఎం మోసెర్ కంపెనీ ప్రతినిధులు ఈ సందర్భంగా వివరించారు. తాము చేపట్టిన వివిధ ప్రాజెక్టుల విశేషాలను తెలిపారు.
బిలియన్ డాలర్ విలువ కలిగిన ఐటి దిగ్గజ కంపెనీ జోహో సీఈఓ శ్రీధర్ వెంబు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆసక్తిగా ఉన్నామని ముఖ్యమంత్రికి చెప్పారు. ముఖ్యమంత్రిని ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ నియో సీఈవో పద్మశ్రీ వారియర్ వున్నారు. సిస్కోతో కలిసి పనిచేసిన పద్మశ్రీ వారియర్‌ది స్వస్థలం విజయవాడ. గతంలో మోటోరోలో ఎనర్జీ సిస్టమ్ గ్రూప్‌లో పనిచేసిన అనుభవం కూడా వారియర్‌కు వుంది. అలాగే సెమి కండక్టర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ప్రపంచ అగ్రశ్రేణి సప్లయర్ గా ఉన్న ARM హోల్డింగ్స్ సంస్థ సీఈఓ సైమన్ అంథోనీ సెగర్స్ తో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. ఎఆర్‌ఎం హోల్డింగ్స్ ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్ పై ప్రస్తుతం దృష్టి నిలిపింది. ప్రభుత్వ పరిపాలనలో, అభివృద్ధి, సంక్షేమ రంగాలలో సాంకేతికతను తమ ప్రభుత్వం ఎలా అందిపుచ్చుకున్నదీ సైమన్‌కు ముఖ్యమంత్రి తెలిపారు.
అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి బృందంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి గుట్టుపల్లి సాయిప్రసాద్, ఆర్థిక అభివృద్ధి మండలి కార్యనిర్వాహక అధికారి జాస్తి కృష్ణకిశోర్, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఐటీ ముఖ్య కార్యదర్శి కావేటి విజయానంద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సోల్మన్ ఆరోఖ్యరాజ్ వున్నారు.