ASBL Koncept Ambience

ద్వైపాక్షిక సమావేశాలతో ముఖ్యమంత్రి బిజీ

ద్వైపాక్షిక సమావేశాలతో ముఖ్యమంత్రి బిజీ

యుఎస్‌ఐబిసి సదస్సులో ముఖ్యమంత్రి వరుస ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. పట్రా కార్ప్ సీఈవో జాన్ ఎస్ సింప్సన్‌తో తొలిగా భేటీ అయ్యారు. విశాఖలో ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ అమెరికన్ బీపీవో పరిమిత స్థలం కారణంగా విస్తరించలేకపోయామని, విశాఖ బీపీవోలో 1500 మంది ఉద్యోగులు వుండగా, స్థలం సమస్య కారణంగా నయా రాయపూర్‌కు 500 మంది ఉద్యోగులను తరలించినట్టు చెప్పారు. విశాఖలో తగిన కార్యాలయ సముదాయం ఉంటే మరో 500 ఉద్యోగాలు కల్పిస్తామని సింప్సన్ చెప్పగా దీనికి వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి టెక్ మహీంద్ర బిల్డింగ్స్ కేటాయించాలని ఏపీఐఐసీకి నిర్దేశించారు. 

నైపుణ్యం పెంచేందుకు బెల్ కర్వ్ లాబ్స్ సిద్ధం

వీసా కార్డ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అంబాసిడర్ డెమెట్రియస్ మరంటీస్‌తోనూ ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. అలాగే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కంపెనీ బెల్ కర్వ్ లాబ్స్ ప్రతినిధులతోనూ సమావేశమయ్యారు. సంస్థ కార్యకలాపాలపై ప్రెజెంటేషన్ ఇచ్చిన ఆ సంస్థ ప్రతినిధులు ప్రపంచ వ్యాప్తంగా 40 % నైపుణ్యం కొరవడినట్టుగా గుర్తించినట్టు చెప్పారు. భారత్‌లో ఈ సమస్య అధికంగా వుందని, అమెరికాలో ఇప్పటికే 'వర్క్ రెడీ కమ్యూనిటీస్' కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు, ఏపీలో ఈ అంశంపై పనిచేయడానికి సిద్ధంగా వున్నామని వెల్లడించారు. 

మొబిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ సీఎండీ డాక్టర్ రవీంద్ర వర్మతోనూ ముఖ్యమంత్రి భేటీకాగా, వారధులు, రహదారులు, ఓడరేవుల నిర్మాణం తమ ప్రత్యేకతగా వర్మ వివరించారు. రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు, అనంతపురం-అమరావతి ఎక్సప్రెస్ వే, రాయపూర్ - విశాఖ హైవే నిర్మాణాలపై ఆసక్తి కనబరిచారు.

ముఖ్యమంత్రితో ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా సమావేశమయ్యారు. సిలికాన్ వ్యాలీని ప్రభావితం చేసిన ప్రధానమైన వ్యక్తుల్లో వినోద్ ఖోస్లా కూడా ఒకరు. ఏపీలో స్టార్టప్స్ ప్రోత్సాహానికి అవసరమైన వ్యవస్థను రూపొందించడంలో సహకారం అందించాలని వినోద్ ఖోస్లాను ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో మరో సిలికాన్ వ్యాలీ ఏర్పాటుకు తోడ్పాటు ఇవ్వాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌కు సహకరించడం తనకు ఆనందదాయకమని వినోద్ ఖోస్లా ముఖ్యమంత్రికి చెప్పారు.

క్లౌడ్ హబ్ చేసేందుకు న్యుటనిక్స్ సాయం

ముఖ్యమంత్రితో న్యుటనిక్స్ సీఈఓ ధీరజ్ పాండే సమావేశమయ్యారు. ఈ సంస్థలో 50 శాతం పైగా ఇంజనీర్లు తెలుగు వారే కావడం విశేషం. అయితే ఏపీని క్లౌడ్ హబ్‌గా రూపొందించడంలో ప్రభుత్వానికి సహకారం అందించేందుకు ధీరజ్ పాండే ఆసక్తి కనబరిచారు. మరో రెండు నెలల్లో దీనిపై స్పష్టమైన రోడ్ మ్యాప్, ప్రాజెక్ట్ రిపోర్టుతో వస్తామని తెలిపారు. క్లౌడ్‌కు సంబంధించిన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించే సామర్ధ్యం నుటనిక్స్‌కు వుంది.

ముఖ్యమంత్రి బృందంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి గుట్టుపల్లి సాయిప్రసాద్, ఆర్థిక అభివృద్ధి మండలి కార్యనిర్వాహక అధికారి జాస్తి కృష్ణకిశోర్, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఐటీ ముఖ్య కార్యదర్శి కావేటి విజయానంద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సోల్మన్ ఆరోఖ్యరాజ్ వున్నారు.

 

Tags :