స్టాన్ ఫోర్డ్ అధికారులతో ముఖ్యమంత్రి భేటీ
అమెరికా పర్యటనలో ఆరో రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ సందర్శించింది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్ డీన్ లాయిడ్ బి మైనర్ (lloyd b minor)తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. వ్యాధులకు చికిత్స అందించడమే కాకుండా ఆరోగ్య పరిరక్షణ విషయంలో సంపూర్ణ జాగ్రత్తలు సూచించడం తమ ప్రత్యేకతగా లాయిడ్ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఏ వ్యక్తి ఏ అనారోగ్యం బారిన పడబోతున్నారో ముందుగానే పసిగట్టి నివారణ, నియంత్రణ చర్యలు తీసుకోడం తమ మెడికల్ స్కూల్ ప్రత్యేకతగా వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో గల వనరులు, అవకాశాలపై ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ప్రెజంటేషన్ ఇచ్చారు.
తాను స్టాన్‌ఫోర్డ్ కుటుంబ సభ్యుణ్నే అని, మొదటినుంచి తనకు స్టాన్ఋఫోర్డ్ అంటే గొప్ప ఆరాధన భావం ఉందని, అందుకే తన కుమారుణ్ని, కోడలి ఇక్కడే చదివించానంటూ ముఖ్యమంత్రి యూనివర్సిటీ అధికారులు చెప్పారు. ఒక సమాజం భవితను నిర్ణయించేది విద్య మాత్రమే అనేది తన విశ్వాసమని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తాము అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టామని, పరిపాలనలో, ప్రభుత్వంలో సాంకేతికతను వినియోగిస్తూ వస్తున్నామని చెప్పారు. ఏపీని వైజ్ఞానిక రాష్ట్రంగా మలచాలన్నది తమ లక్ష్యమన్న ముఖ్యమంత్రి స్టాన్‌ఫోర్డ్ తమకు విజ్ఞాన భాగస్వామిగా ఉండాలంటూ ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి బృందంలో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి గుట్టుపల్లి సాయిప్రసాద్, ఆర్థిక అభివృద్ధి మండలి కార్యనిర్వాహక అధికారి జాస్తి కృష్ణకిశోర్, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఐటీ ముఖ్య కార్యదర్శి కావేటి విజయానంద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సోల్మన్ ఆరోఖ్యరాజ్ వున్నారు.