సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో అమరావతి స్కూల్ ఆఫ్ లింగ్యూస్టిక్స్ ఏర్పాటుకు చంద్రబాబు హామీ
అమెరికాలో పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. మిల్పిటాస్‌లోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం డా. హనిమిరెడ్డి లకిరెడ్డి భవనానికి ముఖ్యమంత్రితోపాటు ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, డా. పరకాల ప్రభాకర్ వెళ్లారు. అచ్చమైన తెలుగు సంప్రదాయ వస్త్రధారణ, వేద మంత్రాలతో దిలీప్ కొండిపర్తి, రాజు చమర్తి, దీనబాబు కొండుభట్ల, అజయ్ గంటి మరియు ఇతర సిలికానాంధ్ర సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
అమెరికాలో ఎవరూ ఊహించనిది, చేయలేనిది అయినటువంటి తెలుగు భాషా, సంస్కృతుల పరిరక్షణకు ఓ ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం సిలికానాంధ్ర సమున్నత ఆలోచనా దృక్పథానికి, వారికి తెలుగు పట్ల గౌరవానికి సూచిక అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనియాడారు. శనివారం నాడు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం లకిరెడ్డి హనిమిరెడ్డీ భవనంలో ప్రసంగించిన ఆయన సిలికానాంధ్ర అంతర్జాతీయంగా తెలుగు భాషకు చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిలికానాంధ్ర వ్యవ్స్థాపక అధ్యక్షుడు, కూచిపూడి నాట్యారామం చైర్మన్ కూచిభొట్ల ఆనంద్, ప్రముఖ ప్రవాసాంధ్ర వైద్యులు డా.లకిరెడ్డి హనిమిరెడ్డి, కోమటి జయరాం, వేమూరు రవి తదితరులు పాల్గొన్నారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో అమరావతి స్కూల్ ఆఫ్ లింగ్యూస్టిక్స్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం తరఫున మిలియన్ డాలర్లు నిధులు అందిస్తామని చంద్రబాబు ప్రత్యేకంగా హామీ ఇవ్వడం పట్ల ఆనంద్ హర్షం వెలిబుచ్చారు.