రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్
రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన ఆయన రోడ్డు మార్గంలో ముచ్చింతల్ చేరుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో జగన్ తొలుత ప్రవచన మండపానికి చేరుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మై హోమ్స్ అధినేత జుపల్లి రామేశ్వరావు సీఎం వైఎస్ జగన్‌కు స్వాగతం పలికారు. చినజీయర్ స్వామి సమక్షంలో ప్రవాస భారతీయ చిన్నారుల విష్ణు సహస్రనామ అవధానాన్ని వీక్షించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ శ్రీరామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయం అన్నారు.
అసమానతలను రూపుమాపేందుకు రామానుజాచార్యులు కృషి చేశారన్నారు. వెయ్యేల్ల క్రితమే అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న చినజీయర్ స్వామికి అభినందనలు తెలిపారు. రామానుజ స్వామి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. రామానుజాచార్యలు భావితరాలకు ప్రేరణ నిలిచారని అన్నారు. అనంతరం చిన్నారులు ప్రజ్ఞా పుస్తకాలను ముఖ్యమంత్రికి బహూకరించారు. అక్కడి నుంచి సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్ దర్శించుకున్నారు. విగ్రహ విశేషాలను చినజీయర్ స్వామి, ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు.