ASBL Koncept Ambience

విపక్షాలపై దాడికి కలం పట్టనున్న కేసీఆర్!

విపక్షాలపై దాడికి కలం పట్టనున్న కేసీఆర్!

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎన్నికల్లో గెలుపుకు, విపక్షాల ఓటమి కోసం కలం పట్టనున్నారు. ఈసారి ప్రచారంలో ఉపన్యాసాలతోపాటు స్లోగన్‌లు ఉపయోగిస్తూనే, మరోవైపు పాట ద్వారా వారిపై దాడి చేయాలని భావిస్తున్నారు. పాటే ఆయుధంగా ఎన్నికల ప్రచారబరిలోకి ఆయన దిగనున్నారు.  స్వయంగా కలంపట్టి కవితలల్లి కదనరంగంలోకి అడుగుపెట్టాలని ఆయన భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇపుడు కలానికి పదునుపెట్టారు. తెలుగుభాష, సాహిత్యంపై అద్భుతమైన పట్టున్న కేసీఆర్‌ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ పార్టీ మళ్ళీ గెలవాల్సిన చారిత్రక అవసరముందని పేర్కొంటూ ఓ మెరుపుపాటకు అక్షరశిల్పిగా మారి సాహిత్యాన్ని అందిస్తున్నట్లు తెలుస్తోంది.

అక్టోబర్‌లో నోటిఫికేఫన్‌, నవంబర్‌ చివరిలో ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో ప్రజల్లో సెంటిమెంటును రగిల్చేలా, ఆలోచన కలిగించేలా.. టీఆర్‌ఎస్‌ పార్టీ అవసరం వివరించేలా ఓ పాటకు కేసీఆర్‌ అక్షరమాల వేస్తున్నట్లు తెలుస్తోంది. తన ఆలోచన, సాహిత్యాన్ని కొందరు సాహితీవేత్తలతో కూడా సీఎం పంచుకున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ జైబోలో తెలంగాణ సినిమాలో గారడి చేస్తుండ్రు.. గడబిడ చేస్తుండ్రు. మొండికి పోతుండ్రు.. తొండికి దిగుతుండ్రు అంటూ పాటరాసి ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకువెళ్ళిన కేసీఆర్‌ ఇపుడు కీలక ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ప్రభుత్వం తిరిగిరావాల్సిన అవసరాన్ని వివరిస్తూ ఓ పాటను రూపొందిస్తున్నట్లు పార్టీవర్గాల ద్వారా తెలిసింది. వేలాది పుస్తకాలు చదివి తెలుగుసాహిత్యంపై తిరుగులేని పట్టు సంపాదించిన కేసీఆర్‌ ప్రపంచ తెలుగుమహాసభలలో తన పదవిన్యాసంతో సాహితీ సుగంధాలతో సభికులను సమ్మోహనపరిచిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలకంటే ముందుగానే అనూహ్యంగా ఎన్నికలు తీసుకొచ్చి విపక్షానికి షాక్‌నిచ్చిన కేసీఆర్‌ ఇపుడు మహాకూటమిగా విపక్షం జట్టుకట్టిన నేపథ్యంలో ఢిల్లికి, అమరావతికి గులాములుగా ఉందామా.. తెలంగాణ స్వీయఅస్తిత్వాన్ని కాపాడుకుందామా అన్న అంశాల ప్రాతి పదికగానే ప్రాంతీయ అస్త్రాలు సంధిస్తూ ఈ పాటను మలిచేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

దీంతోపాటు అందరికీ చేరువయ్యేలా, విపక్షాలకు తూటాల్లాగా స్లోగన్‌లు కూడా తయారు చేసేందుకు కేసీఆర్‌ నడుంబిగించారు. ఈ స్లోగన్‌ లు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు సరికొత్త అస్రా ్తలుగా మారుతాయని ముఖ్యనేతలు ధీమాగా చెబుతున్నారు.

ముందుగా ప్రజాఆశీర్వాద సభల్లో తాను రూపొందించిన సరికొత్త స్లోగన్లను ప్రజలతో పలికించి, క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపాలని దిశానిర్దేశం చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లి పార్టీలను, అమరావతి పార్టీలను కట్టగట్టి తెలంగాణ నుండి తరమాలనే నినాదాలు ప్రధానంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నోటిఫికేఫన్‌ రాగానే.. సీఎం పెన్ను నుండి అక్షరమాలగా మారిన పాటను విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

 

Tags :