ASBL Koncept Ambience

అయుత చండీ మహా యాగం దిగ్విజయం....

అయుత చండీ మహా యాగం దిగ్విజయం....

సర్వజనహితం కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు మెదక్‌ జిల్లా ఎర్రవల్లిలో చేపట్టిన అయుత చండీమహాయాగం అత్యంత వైభవోతంగా దిగ్విజయమైంది. ఐదు రోజుల పాటు నియమ నిష్టలతో నిర్విఘ్నంగా సాగిన ఈ చండీమహాయాగం 5వ రోజు నిర్వహించిన మహాపూర్ణాహుతి తో సంపూర్ణంగా పరిసమాప్తమైంది. విశ్వశాంతి, లోకకల్యాణం, ప్రజా సౌభాగ్యమే సంకల్పంగా పూర్ణాహుతి జరిగింది. డిసెంబర్‌ 23 నుంచి 27వ తేదీ వరకు ఈ యాగం జరిగింది. యాగం నిర్వహణతో ఎర్రవల్లి గ్రామం చరిత్రలో నిలిచిపోయింది. జగజ్జనని అమ్మవారిని యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా అని అక్కడికి వచ్చిన భక్తులు చండీమాతను కొలిచారు.  తెలంగాణ ప్రజలే కాదు, పొరుగు రాష్ట్రాలవారు కూడా యాగంపై ఆసక్తినిచూపారు.  విశిష్టత తెలియని  తొలిరోజే 50వేల మంది సామన్య భక్తులు ఈ పవిత్ర పుణ్యకార్యంలో పాలుపంచుకున్నారు. తెలంగాణ మహారథులు అతిథులై అమ్మవారి ఆశీస్సులకోసం తరలి వచ్చారు.

ఆరంభం నుంచి ...

వైదిక సంస్కృతి గల తెలంగాణ గడ్డమీద 1500 మంది నిష్టా గరిష్టులైన రుత్విజులు వేద పారాయణాలు చేయడం నిజంగా అద్భుతమనిపిస్తుంది. అయుత చండీయాగానికి కీలకమైన రుత్విజులు ఎర్రవల్లి యాగానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చారు. చరిత్ర ప్రకారం గత 200 ఏళ్లలో అయుత చండీ యాగాన్ని రెండే రెండుసార్లు చేశారు. మొదటి సారి శృంగేరి పీఠాథిపతి షష్టిపూర్తి సమయంలో చేశారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ యాగాన్ని నిర్వహించారు. చండీ హోమానికి సంబంధించి నవ చండీ యాగం, శత చండీ యాగం, సహస్త్ర చండీ యాగం, అయుత చండీ యాగం, లక్ష చండీ యాగం చేస్తారు. చండీ హోమం, నవ చండీ హోమం, శత చండీ యాగాలను తరుచుగా సహస్ర చండీ యాగాలను అరుదుగా, అయుత చండీ యాగాలను చాలా అరుదుగా చేస్తుంటారు.  సాధారణంగా గణపతి హోమం, అయుష్య హోమం, మృత్యుంజయ హోమాలను ఒక దైవాన్ని ఉద్దేశించి చేస్తారు. కానీ చండీ యాగంలో మాత్రం మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతి మగ్గురమ్మలకు కలిపి పూజలు నిర్వహిస్తారు.  చండీ దేవత చాలా ప్రచండ శక్తి. చండీయాగంలో ఐదురోజులపాటు ఒక్కో హోమం, పూజలను చేశారు.

ప్రతి రోజు గురువందనం, మాతృవందనతో ప్రారంభమై పూజాదికాలు గణపతి పూజ, సప్తశతీ పారాయణం, నవార్ణవపారణంతో పాటు చతుర్వేదఘోషతో మారుమోగింది. చండీమాత విగ్రహం ముందు ప్రధాన రుత్విజులు గోపికృష్ణ శర్మ, పణిశశాంక శర్మ, హరినాధశర్మలు శృంగేరీ పీఠం నుంచి ప్రత్యేకంగా వచ్చిన నర హరి సుబ్రహ్మణ భట్‌ ఆధ్వర్యంలో గురు ప్రార్థనలు  జరిపారు. శ్రీ సచ్చిదానంద చంద్రశేఖర భారతీ తీర్థ, విద్యాతీర్థ గురుంభజే వందే గురు పరంపర... సాష్టాంగ ప్రమాణ సమర్పయామి అంటూ రుత్వికులంతా ముఖ్యమంత్రితో సహా గురు ప్రార్థన చేసి కార్యక్రమాలను తొలుత ప్రారంభించారు.

1వ రోజు

చండీమాత పూజతో ప్రారంభమైన అయుత మహా చండీయాగం గణపతి మహాపూజ, మహా సంకల్పం, గోపూజ, మహామంటప  స్థాపనం, చండీయంత్ర లేఖనం, యంత్ర ప్రతిష్ట, దేవతా ఆవాహనం, ప్రాణ ప్రతిష్ట, చండీ పారాయణం కార్యక్రమాలతో మొదటిరోజు యాగం పూర్తయింది.

2వ రోజు

గణపతి  పూజ, ఏకాదశ న్యాస పూర్వక ద్విసహస్ర చండీ పారాయణంతో  ప్రారంభమై మహా ధన్వంతరీ యాగం, రాజశ్యామల చతుర్వేద మహారుద్ర పురశ్చరణలు, మహాసౌరం, దంపతీ పూజా కార్యక్రమాలతో పూర్తయింది. 
3వ రోజు

గురుప్రార్థన, గోపూజ, ఏకాదశన్యాసపూర్వక త్రిసహస్ర చండీ పారాయణాలు, నవగ్రహ హోమం, ఉక్తదేవతా జపమేలు, దంపతీ పూజతో పాటు పార్థివ లింగపూజ, అష్టాదశ సేవ వంటి పూజా కార్యక్రమాలు జరిగాయి. 
4వ రోజు

గురు ప్రార్థన, గణపతి పూజ, ఏకాదశ న్యాస పూర్వక చతుస్సహస్ర చండీ పారాయణాలు, సువాసినీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
5వ రోజు

చివరిరోజైన ఐదోరోజు గురు ప్రార్థన, పుణ్యాహవచనం, కుండ సంప్కారం, ప్రధాన కుండంలో అగ్ని ప్రతిష్ట, అగ్ని విహరణం, సపరివార అయుత చండీయాగం అయుత లక్ష నవాక్షరీ, మహా పూర్ణాహుతి జరిగింది.

యాగశాల లోపల ఉన్న 101 హోమ గుండాల దగ్గర 1100 మంది రుత్వికులు, వారికి కావాల్సిన సమిధులు, పాయసం, నెయ్యి, కర్పూరం తదితర పూజా సామాగ్రిని ఇతర బ్రాహ్మణులు సమకూర్చారు. ప్రధా గుండంలో అగ్ని ప్రతిష్ట తర్వాత ఆగ్నిని ఆవాహన చేశారు. దానిని అగ్ని విహరము అనే ప్రక్రియ ద్వారా మిగిలిన నూరు గుండాలలో ప్రతిష్ట చేశార. మహా పూర్ణాహుతి  చేయడానికి ముందు చతుర్వేద, మహారుద్ర, రాజశ్యామల యాగాశాలల్లో పూర్ణాహుతి జరిగింది. అగ్ని విహరణలో భాగంగా జరిగిన హోమంలో ప్రతి రుత్వి జుడు సప్తశతి మంత్రాలతో 700 ఆహుతులను పరమానన ద్రవ్యంగా ఇచ్చారు. 1000 ఆహుతులను ఆజ్య ద్రవ్యంగా ఇచ్చారు. 7 లక్షల పరమాన్న ద్రవ్యం, 10 లక్షల ఆజ్య ద్రవ్యం ఆహుతి చేశారు. అంతకు ముందు జరిగిన తర్పణంలో వంద మంది రుత్వికులు పూర్వాంగ, ఉత్తరాంగ సహితంగా కూడా జరిపించారు. అభిషేక జాలలతో యజమాని(కేసీఆర్‌) దంపతులకు అవభృతం చేయించారు. అయుత చండీ మహాయాగం మహా పూర్ణాహుతితో ముగిసిన తర్వాత పీఠాధిపతులు సిఎం  కేసీఆర్‌ కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు.  సీఎం కేసీఆర్‌కు శాలువా కప్పి ఆశీర్వదించారు. అనంతరం సిఎం వేదికపై నుంచి రుత్వికులకు నమస్కారం చేశారు. రుత్వికులు సిఎంను ఆశీర్వదించారు.

ప్రారంభ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌, హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి భోస్లే, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు రవిశంకర్‌ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. రెండోరోజు బిజెపికి  చెందిన కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ,  25వ మహారాష్ట్ర గవర్నర్‌ చెన్నమనేని విద్యా సాగర్‌రావు, వివిధ పత్రికాధిపతులు 26న తమిళనాడు గవర్నర్‌ కొణిజేటీ రోశయ్య, నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ హాజరయ్యారు. 27న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రాష్ట్ర మంత్రులు, ఆ పార్టీ కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఏపీ స్పీకర్‌ కొడెల శివప్రసాదరావు, ఏపీ శాసనమండలి చైర్మన్‌ చక్రపాణి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులతో ఎర్రవెల్లికి కలిసి వచ్చి కేసీఆర్‌ చండీయాగంలో  పాల్గొన్నారు. శృంగేరీ బాలి పీఠాధిపతి విధుశేఖర భారతీ మహాస్వామి తండ్రి  కుప్ప శివసుబ్రహ్మణ్యం తాతా కుప్ప గోపాల వాజపేయి యుజి కూడా ఈ యాగంలో పాల్గొని కేసీఆర్‌ను ఆశీర్వదించారు.

త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజియర్‌స్వామి, పరిపూర్ణానందస్వామి, మాధవానంద సరస్వతి యాగంలో చివరి రోజు కెసీఆర్‌ ధరించే పట్టు వస్త్రాలను శృంగేరీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ స్వామి ముందు రోజు పంపారు. ప్రత్యేక దూత ద్వారా ముఖ్యమంత్రికి ఆశీర్వచనతో పాటు, ఈ పట్టు వస్త్రాలు పంపారు.  ముఖ్యమంత్రి వాటినే ధరించి చివరి రోజు పూజలో పాల్గొన్నారు. శృంగేరీ పీఠం నుంచి ప్రత్యేకంగా సిఎం కోసం ప్రసాదం పంపారు. పుష్పగిరి పీఠాధిపతి, హలిదీపురం పీఠాధిపతి, గోపాలకృష్ణ మఠ  పీఠాధిపతి, మాదవీనంద స్వామి, కపిలేశ్వరస్వామి, కమలానంద భారతి తదితరులు పాల్గొని కేసీఆర్‌ దంపతులను ఆశీర్వదించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా రాత్రి అన్నమయ్య భావనా వాహిణి వ్యవస్థాపకురాలు శోభారాజు అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. 

యాగంలో అలరించిన వక్తలు

అయుత చండీయాగం సమాచారాన్ని భక్తులకు అందించేందుకు నిర్వాహకులు సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ముడిపల్లి దక్షిణామూర్తి, ఆదారనుపల్లి శశిధరశర్మ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. యాగం సమాచారాన్ని, విశిష్టతను ఎప్పటికప్పుడు వివరించారు. ఆద్యంతం వాక్చాతుర్యంతో ఆకట్టుకున్నారు. 

చండీయాగంలో రోజుకో వర్ణం వస్త్రాలు

అయుత చండీయాగం నిర్వహణలో యాగకర్త, రుత్వికులు రోజుకో వర్ణం వస్త్రాలు ధరించారు. యాగంలో  పాల్గొన్న వారు తొలిరోజు పసుపు, రెండోరోజు గులాబీ, మూడో రోజు తెలుపు, నాలుగో రోజు ఎరుపు, ఐదో రోజు పసుపు వస్త్రాలు ధరించారు.

 

Tags :