కేసీఆర్ ముందస్తుకు ఎందుకు వెళ్లారో తెలుసా?
తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లింది ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ అడ్డగోలు విమర్శలు పడలేక ముందస్తు ఎన్నికలకు వెళ్లామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోవద్దనే ఎన్నికలకు వెళ్లామని ఆయన సృష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాగజ్‌నగర్‌లో టీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని కేసీఆర్ మాట్లాడుతూ 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్-టీడీపీలు ఒకవైపు, నాలుగున్నరేళ్లు అభివృద్ధి చేసిన టీఆర్‌ఎస్ మరోవైపు ఉన్నాయన్నారు. వాళ్ల పాలనలో కరెంట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు గమనించాలన్నారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఇవ్వగలుగుతున్నామని సృష్టం చేశారు. హైదరాబాద్‌ను కట్టానంటున్న చంద్రబాబు కరెంట్ ఎందుకివ్వలేదని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఎన్నో సమస్యల మధ్య అద్భుత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని విమర్శించారు. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ మూడో గ్రేడ్ పథకం.. తెలంగాణలో అమలవుతున్న ఆరోగ్యశ్రీతో పోల్చితే 20 శాతం మాత్రమే ఉంటుందని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో కులమతాలకతీతంగా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అవినీతిని అరికట్టి సంపద పెంచుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో గుడుండా బట్టీలు లేవని, పేకాట క్లబ్బులు లేవని అన్నారు. తెలంగాణను మళ్లీ కాకులు, గద్దలకు అప్పగించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.