ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతిస్తాం : కేసీఆర్
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సైతం అభ్యంతరాలు లేవని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విష్పష్టంగా ప్రకటించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ నిర్వహించిన ఎన్నీకల ప్రచార సభలో కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర పాలనలో గుణాత్మక మార్పు కోసం టీఆర్‌ఎస్ 16 స్థానాలు గెలవాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఓడిపోతున్నారని జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అనేకసార్లు మా కేశవరావు రాజ్యసభలో మాట్లాడారు. మా ఎంపీలు సైతం లోక్‌సభలో ప్రస్తావించారు. నేను కూడా చెప్పిన. ఇప్పటికీ మాది అదే మాట. మాకున్న సమాచారం మేరకు వంద శాతం తెలంగాణలో మేం 16, ఒకటి వైసీపీ.. మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో గెలుస్తున్నం. ఆంధ్రప్రదేశ్‌లో మంచి మెజార్టీతో జగన్ గెలుస్తున్నరు. టీఆర్‌ఎస్, వైకాపా లోక్‌సభ అభ్యర్థులు సుమారు 35 నుంచి 36 స్థానాల్లో విజయం సాధించబోతున్నారు. కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని మా ఎంపీలు లోక్‌సభలో గొంతెత్తుతారు. టీఆర్‌ఎస్ పార్టీగా మేం కచ్చితంగా మద్దతు ఇస్తున్నాం అని అన్నారు.