చరిత్రలో నిలిచిపోయేలా తెలుగు మహాసభలు : కేసీఆర్
కొత్తగా ఏర్పాటైన తెలంగాణలో ప్రపంచ తెలుగు మహాసభలు చరిత్రలో నిలిచిపోయేలా దేదీప్య మానంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. సాహిత్య సమావేశాలకు అద్భుతమైన స్పందన వస్తుంటే గుండెల నిండా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు మూడోరోజు సందడిగా సాగాయి. హైదరాబాద్ బొగ్గుల కుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో శతావధానం ఆసక్తికరంగా సాగింది. జీఎం రామ శర్మ శతావధానంలో వృచ్ఛకులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ వేదికల్లో చోటు సరిపోలేనంతమంది సాహితీ ప్రియులు హాజరవడం సంతోషంగా ఉందన్నారు. కవి సమ్మేళనాలు, చర్చలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ మధ్య కాలంలో సాహితీవేత్తలకు కాస్త ఆదరణ తగ్గిందని ఇకపై ఆటాంటి పరిస్థితి ఉండదన్నారు. సాహితీ వేత్తలకు తగిన గుర్తింపు దక్కుతుందని సృష్టం చేశారు. సభ నిర్వహణ, అతిథులకు భోజన సదుపాయం బాగున్నాయని తెలిపారు. సాహితీప్రియుల సహకారం వల్ల తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. సభల ముగింపు రోజున చరిత్రాతమకమైన నిర్ణయాలు వెల్లడిస్తాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు హర్షించేలా తీర్మానాలు ప్రకటిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఒకప్పుడు తనకు 3వేల తెలుగు పద్యాలు కంఠస్తం వచ్చేవని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కె.కేశవరావు, బాల్కా సుమన్, నందిని సిధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.