ముచ్చింతల్లో సీఎం కేసీఆర్
భక్తి ఉద్యమంలో రామానుజాచార్యులు గొప్ప విప్లవం తీసుకొచ్చారని, మానవులంతా సమానమంటూ.. సమానత్వం కోసం వెయ్యేండ్ల క్రితమే ఎంతో కృషి చేశారని, తెలంగాణ వేదికగా తిరిగి వెయ్యేండ్ల తర్వాత ఆ మహామూర్తి బోధనలు మళ్లీ మరింత ప్రాచుర్యంలోకి రావడం, అవి మరో వెయ్యేండ్లపాటు ప్రపంచవ్యాప్తం కానుండటం మనందరికీ ఎంతో గర్వకారణమని కేసీఆర్ తెలిపారు. భగవంతుని దృష్టిలో మనుషులంతా సమానమేనని చాటిచెప్పిన శ్రీరామానుజాచార్యుల విరాట్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం హైదరాబాద్‌కే కాదు దేశానికే గర్వకారణమని చెప్పారు. ముచ్చింతల్ శ్రీరామనగరం వేదికగా ప్రారంభమైన శ్రీరామానుజ సహస్రాబ్ది మహోత్సవాలకు గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి హాజరయ్యారు. 5వ తేదీన ఇక్కడికి ప్రధాని మోదీ వస్తున్న సందర్భంగా అక్కడ భద్రత, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ మహా ఉత్సవానికి హాజరయ్యే భక్తులకు తమ కుటుంబం తరఫున పండ్లు, ఫలాల ప్రసాదాన్ని అందజేస్తామని తెలిపారు. సీఎం వెంట ఆయన సతీమణి శోభ, మనుమడు హిమాన్షు ఉన్నారు.