ఏపీ ఉత్పత్తుల విక్రయాలకు ఊతం
ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ ఉత్పత్తుల విక్రయాలకు అవసరమయ్యే ఆర్థిక సాయం అందించాలని యూకేలోని ప్రముఖ గ్లోబల్ కార్పొరేట్ బ్యాంకింగ్ సంస్థ ‘శాంటండర్’ నిర్ణయించింది. ఇకపై రాష్ట్రంలోని ఎగుమతిదారులు, యూకేలోని దిగుమతిదారులకు కావాల్సిన ఆర్ధికమద్దతు ఇవ్వనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో బుధవారం సమావేశమైన ‘శాంటండర్’ ఇండియా డెస్క్ డైరెక్టర్ ఎడ్వర్ట్ డిక్సన్, ఎక్స్‌పోర్ట్స్-ఏజన్సీ ఫైనాన్స్ అధిపతి ఫిలిప్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. గుంటూరు నుంచి మిర్చి ఎగుమతుల వ్యవహారాల్లో ఇప్పటికే తాము పాలుపంచుకుంటున్నామని ముఖ్యమంత్రికి వివరించిన ‘శాంటండర్’ ప్రతినిధులు తాము ఏపీతో అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి సిద్ధంగా వున్నామని తెలిపారు. ఏపీలో ఎగుమతిదారులు, యూకేలో కొనుగోలుదారుల మధ్య సంధాయకర్తగా కూడా వ్యవహరిస్తామని చెప్పారు.ఫిన్‌టెక్ రంగంలోనూ అగ్రగామైన ‘శాంటండర్’ ఏపీలోని ‘ఫిన్‌టెక్ వ్యాలీ’కి సహకరించాలని ముఖ్యమంత్రి సూచించగా, దీనికి ఆ సంస్థ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. అలాగే ఆహారశుద్ధి, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల వ్యవహారాలలో ఆర్థిక ఊతానికి అంగీకరించారు.