ASBL Koncept Ambience

స్వాగతం - సుస్వాగతం... రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటనకు అంతా రెడీ 

స్వాగతం - సుస్వాగతం... రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటనకు అంతా రెడీ 

ఆగస్టు 4 నుంచి 9వరకు వివిధ నగరాల్లో పర్యటన

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌ రెడ్డి అమెరికాకు వస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితోపాటు, మంత్రులు శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్‌ అధికారులు శ్రీమతి శాంత కుమారి, చీఫ్‌ సెక్రటరీ (ఒక రాష్ట్ర సిఎస్‌ ముఖ్యమంత్రితో కలిసి ప్రయాణించడం ఇదే మొదటిసారి కావచ్చు), ఐటి అండ్‌ సి డిపార్ట్‌మెంట్‌ మాత్రమే కాకుండా పరిశ్రమలను కూడా చూసుకునే ఐఎఎస్‌ అధికారి శ్రీ జయేష్‌ రంజన్‌,  ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ ఎన్నారై వ్యవహారాల ఐఎఫ్‌ఎస్‌ అధికారి డా. ఇ. విష్ణువర్ధన్‌ రెడ్డి వస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో చురుకుగా వ్యవహరిస్తూ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ కన్వీనర్‌గా నియమితులైన వై.నరేందర్‌ రెడ్డి ఈ పర్యటన ఏర్పాట్లను సమన్వయం చేస్తున్నారు. ఆగస్టు 4 నుంచి 9వ తేదీ మధ్య అమెరికాలోని వివిధ నగరాల్లో ఈ బృందం పర్యటించనున్నది. ఈ సందర్భంగా  పలు సంస్థలు, కంపెనీలు, పెట్టుబడిదారులతో మమేకమవనున్నారు. ఎంవోయూలు చేసుకోనున్నారు. పలు సంస్థల అధినేతలతో ముఖ్యమంత్రి, వారి బృందం సమావేశమై తెలంగాణలో ఉన్న అవకాశాలను వారికి వివరించి భారీగా పెట్టుబడులను సమీకరించనున్నారు. కాగా ముఖ్య మంత్రి రేవంత్‌ రెడ్డికి అమెరికా పర్యటన కొత్తకాన్నప్ప టికీ ముఖ్యమంత్రి హోదాలో రావడం ఇదే మొదటి సారి. రేవంత్‌ రెడ్డికి అమెరికాలో ఎంతోమంది మిత్రులు, అభిమానులు ఉన్నారు. గతంలో ఆయన టిడిపిలో ఉన్నప్పడు, తరువాత కాంగ్రెస్‌లో చేరిన తరువాత ఎంతోమంది ఆయనకు మిత్రులయ్యారు. దానికితోడు ఆయన సోదరుడు జగదీష్‌ రెడ్డి ఫిలడెల్ఫియాలో నివసిస్తూ వుండటం వలన రేవంత్‌ రెడ్డి అమెరికా  వచ్చినప్పుడల్లా ఫిలడెల్ఫియాకు వస్తారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎల్లప్పుడూ యువకుడిలా కనిపిస్తుంటారు. ఆయన ప్రసంగాలు, వేగంగా తీసుకునే నిర్ణయాలు కూడా ఆ విదంగానే ఉంటాయి. కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీకి సన్నిహితమై తనను పిసిసి అధ్యక్షునిగా నియమిస్తే కాంగ్రెస్‌ను గెలిపించి అధికారంలోకి తీసుకువస్తానని చెప్పారు. ఆయన పట్టుదల, ఆత్మవిశ్వాసం చూసిన కాంగ్రెస్‌ హైకమాండ్‌ పిసిసి అధ్యక్షునిగా రేవంత్‌ రెడ్డిని నియమించింది. పిసిసి అధ్యక్షునిగా నియమించినప్పుడు ఆయనకు సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుల నుంచి విమర్శలు, సహాయ నిరాకరణ వంటివి ఎదురైనా  తాను చేయాల్సినవి చేస్తూ ప్రజల్లోకి కాంగ్రెస్‌ వస్తే ఎంత లాభమో తెలియజేసి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చారు. పిసిసి అధ్యక్షునిగా ఆయన చూపిన తెగువ, ప్రజలను ఆకట్టుకున్న తీరును చూసి కాంగ్రెస్‌ అధిష్టానం ఆయననే ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తరువాత సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులను తనవైపు తిప్పుకుని రాజకీయ చాణక్యం ప్రదర్శించి పరిపాలనలో కూడా వారిని భాగస్వాములను చేశారు. అధికారం చేపట్టగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి వాటిని విడతలవారీగా అమలు చేస్తూ ప్రజలు కూడా మెచ్చుకునేలా పాలన చేస్తున్నారు.

తెలంగాణను మరింతగా అభివృద్ధి చేయడానికి అవసరమైన పెట్టుబడులకోసం విదేశాల్లో పర్యటించాలని ఆయన నిర్ణయం తీసుకోవడం సరైన చర్యగా చెప్పవచ్చు. అందులో భాగంగా ఆయన అమెరికా వస్తున్నారు. ఇప్పుడు లభించిన సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి బృందం ఆగస్టు 3వ తేదీ రాత్రికి న్యూయార్క్‌ చేరుకుంటుంది.  ఆదివారం, 4 ఆగస్టు ఉదయం న్యూ జెర్సిలోని రాయల్‌ ఆల్బర్ట్‌ ప్యాలెస్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ముఖ్యమంత్రి, వారి బృందం మాట్లాడనున్నారు. న్యూయార్క్‌, న్యూజెర్సీలలో 4, 5 తేదీలలో ఐటీ మరియు ఎం ఎన్‌ సి  కంపెనీలను సిఎం, ఆయన బృందం సందర్శించనున్నది.  ఆగస్టు 6, 7 తేదీలలో డల్లాస్‌లో ఈ బృందం పర్యటించనున్నది. డల్లాస్‌ లో కూడా వారు కంపెనీలను సందర్శించడంతోపాటు,  పారిశ్రామిక వర్గాలతో సమావేశం కానున్నారు. ఆగస్టు 7వ తేదీన డల్లాస్‌ లో ఎన్నారైలతో మీటింగ్‌ ఉంటుంది. డల్లాస్‌ పర్యటనలో ఐటీ  సర్వ్‌ అలయన్స్‌ తో కూడా ఒక సమావేశాన్ని నిర్వహించడానికి  ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి, వారి బృందం శాన్‌ ఫ్రాన్సిస్కోలో ఆగస్టు 8 మరియు 9 తేదీల్లో పర్యటించనున్నది. ఈ సందర్భంగా ఇండియన్‌ కాన్సుల్‌ జనరల్‌ శ్రీ శ్రీకర్‌ రెడ్డి, కంపెనీలు మరియు ఎం ఎన్‌ సి యజమానులతో సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. పర్యటన ఏర్పాట్లను ఆయన సమన్వయం చేస్తున్నారు. ఆగస్టు 9  సాయంత్రం ఫ్రీమాంట్‌లోని హార్ట్‌ఫుల్‌నెస్‌ సెంటర్‌లో ఎన్నారైలతో సమావేశం జరగనున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పర్యటన, సమావేశాల్లో  తెలుగు సంఘాలు, తెలుగు ప్రముఖులు పాల్గొననున్నారు. ఆయనతో వ్యక్తిగతంగా కలవడానికి కూడా వారు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు.  

అమెరికాలో 2 దశాబ్దాలకుపైగా తెలుగువారికి మీడియా పరంగా సేవలందిస్తున్న తెలుగు ట్కెమ్స్‌ ఈ పర్యటనలో కూడా మీడియాపరంగా సేవలను అందిస్తోంది. మే 2007లో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అమెరికా పర్యటన నుండి సీఎంల పర్యటనలలో చురుగ్గా పాల్గొంటోంది. తెలుగు సంఘాలను ఈ పర్యటనలో పాలుపంచుకునేలా చేస్తోంది. ముఖ్య మంత్రి హోదాలో గతంలో అమెరికాకు వచ్చిన చంద్రబాబునాయుడు, వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డిల పర్యటనల్లో కూడా తెలుగు టైమ్స్‌ పాలుపంచుకుంది. వారి పర్యటన ఏర్పాట్లను, సమావేశాలకు విస్తృత కవరేజ్‌ ఇస్తూ తెలుగు ట్కెమ్స్‌ అందరి ప్రశంసలను అందుకుంది. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పర్యటనలో కూడా ‘తెలుగు టైమ్స్‌’ చురుకైన పాత్రను పోషించి తెలుగు ప్రముఖుల అభినందన సందేశాలు, ఇతర సమాచారాలతో కూడిన ప్రత్యేక సంచికను కూడా తీసుకువచ్చింది.  

అభినందనలు....

అమెరికాలో ఉన్న తెలంగాణవాసులు తమ సంస్కృతిని, సంప్రదాయాన్ని పదిలంగా కాపాడుకుంటూ, తెలుగు భాష ఉన్నతికి చేస్తున్న సేవ అభినందనీయం...ఎన్నారై సోదరులకు నా అభినందనలు... ఏ దేశమేగివనా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లిభూమి భారతిని అన్నట్లుగా ఎన్నారైలు దేశం కాని దేశంలో ఉన్నా తమ సంప్రదాయాలను, సంస్కృతిని మరవకుండా కాపాడుకోవడంతోపాటు వివిధ కార్యక్రమాల ద్వారా వాటిని నేటితరానికి తెలియజెప్పి సుసంపన్నం చేస్తున్నందుకు ధన్యవాదములు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు కూడా తెలంగాణ సంఘాలు సేవ చేయడం చాలా సంతోషం.  అదే విధంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి అమెరికాలో ఐటీ రంగంలో, ఇతర వ్యాపార రంగాలలో పేరు తెచ్చుకొంటున్న తెలుగు వారికి అభినందనలు. మీ వ్యాపార అభివృద్ధికి, మీకు మాతృ దేశం మీద వున్న మమకారానికి గుర్తుగా తెలంగాణ రాష్ట్రంలో మీ వ్యాపారాలు కొనసాగించాలని కోరుతున్నాను. 

అమెరికాలోని మన సోదరసోదరులను స్వయంగా కలుసుకోవడంతోపాటు వారితో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తెలియజెప్పాలన్న ఉద్దేశ్యంతో అమెరికా పర్యటనకు వస్తున్నాను. నాతోపాటు మంత్రులు, అధికార బృందం కూడా మిమ్మల్ని కలవడానికి వస్తోంది. అలాగే కార్పొరేట్‌ వర్గాలతో కూడా సమావేశమై వారిని కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించనున్నాము. వివిధ నగరాల్లో జరిగే సమావేశాలకు ఎన్నారై సోదరులంతా వచ్చి తెలంగాణ అభివృద్ధికి మీ వంతుగా సహకరించాలని కోరుకుంటున్నాను.

-  రేవంత్‌ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి 

 

 


 

Tags :