ASBL Koncept Ambience

వరల్డ్ ఫేమస్ బిజినెస్ కన్సల్టెంట్ డాక్టర్ రామ్ చరణ్‌ను కలిసిన సీఎం రేవంత్

వరల్డ్ ఫేమస్ బిజినెస్ కన్సల్టెంట్ డాక్టర్ రామ్ చరణ్‌ను కలిసిన సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. అనేకమంది పారిశ్రామికవేత్తలను, సీఈవోలను కలుస్తూ, తెలంగాణకు పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ఆయన కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాలిఫోర్నియా బే ఏరియాలో జరిగిన బిజినెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం రేవంత్.. ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ కన్సల్టెంట్, రచయిత, వక్త డాక్టర్ రామ్ చరణ్ ను కలిశారు. గత 40 ఏళ్లుగా అమెరికా వ్యాపార ప్రపంచంలో ప్రభావవంతమైన ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, పలు అగ్రశ్రేణి కంపెనీల సీఈవోలు, బోర్డులతో కలిసి పనిచేసిన అనుభవం డాక్టర్ రామ్ చరణ్‌కు ఉంది. ఆయన ప్రస్తుతం తెలంగాణ ప్రజాప్రభుత్వం చేపట్టిన కార్యాచరణపై ఆసక్తి కనబర్చినట్లు తెలుస్తోంది.

బ్యాంక్ ఆఫ్ అమెరికా, టయోటా, నోవార్టిస్, జనరల్ ఎలక్ట్రిక్, యూఎస్ టీ గ్లోబల్, కేఎల్ఎం ఎయిర్‌లైన్స్, మ్యాట్రిక్స్‌ సహా ప్రపంచంలోని ఎన్నో అగ్రశ్రేణి సంస్థలకు కన్సల్టెంట్‌గా డాక్టర్ రామ్ చరణ్ పనిచేశారు. ఇలాంటి కీలకమైన బాధ్యతలు చేపడుతూనే డాక్టర్ రామ్ చరణ్  30కిపైగా పుస్తకాలు రాయడం గమనార్హం. ఆయన్ను కలిసిన సీఎం రేవంత్.. డాక్టర్ రామ్ చరణ్ అనుభవం తెలంగాణ పురోగతికి ఎంతో తోడ్పడుతుందని అన్నారు. వీలైనంత త్వరలోనే హైదరాబాద్‌ను సందర్శించి, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను పరిశీలించాలని, అవి విజయవంతం అయ్యేందుకు సూచనలు చేయాలని డాక్టర్ రామ్ చరణ్ ను సీఎం రేవంత్ ఆహ్వానించారు. దీనిపై డాక్టర్ రామ్ చరణ్ కూడా సానుకూలంగా స్పందించారు.
 

 

 

Tags :