ASBL Koncept Ambience

వలసల వడదెబ్బతో కాంగ్రెస్‌ విలవిలా

వలసల వడదెబ్బతో కాంగ్రెస్‌ విలవిలా

తెలంగాణలో ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్‌ పార్టీ అధికార టీఆర్‌ఎస్‌, కేంద్రంలోని బిజెపి పార్టీల ఆకర్ష్‌ దెబ్బతో విలవిలలాడిపోతోంది. దాంతో బలమైన ప్రతిపక్షంగా, గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేలా తయారైన కాంగ్రెస్‌ పార్టీ నేడు ఉన్న డజన్‌ ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేకపోతోంది. తెరాస, ఇటు బీజేపీ పార్టీలు విసిరిన ఆకర్ష్‌ అస్త్రాలు తగిలి కాంగ్రెస్‌ విలవిలలాడుతోంది. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఒకరి తరువాత ఒకరు తెరాస కారెక్కుతూంటే.. కాంగ్రెస్‌లోని సీనియర్‌ నేతలు బిజెపిలో చేరిపోతున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఘోరపరాజయం ఎదుర్కొన్న కాంగ్రెస్‌ తాజా ఫిరాయింపులతో చిక్కి శల్యమైంది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే కీలక నేతలు ఫిరాయించడంతో ఏమీ తోచని స్థితిలో పడిపోయింది. మిగిలిన ముఖ్య నేతలను ఆహ్వానించి టీఆర్‌ఎస్‌కు దీటుగా తెలంగాణలో ఎదగాలని భావిస్తున్న బీజేపి కూడా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులపై వల వేసింది. మహబూబ్‌నగర్‌కు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత డీకే అరుణ చేరికతో పావులు కదిపిన కమలం.. రాష్ట్రంలో ఆకర్ష్‌ వ్యూహాన్ని వేగంగా అమలు చేస్తోంది. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలేవీ ఊహించనివిధంగా బీజేపీ వేసిన పాచిక బాగానే పనిచేసింది.

ఒక వైపు పార్లమెంట్‌ ఎన్నికల వేళ.. మరో వైపు తెలంగాణ కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌లు.. హేమా హేమీలు కాంగ్రెస్‌ను వీడటంతో దిక్కుతోచని స్థితిలో ఆ పార్టీ నేతలు కొట్టుమిట్టాడుతున్నారు. డీకే అరుణ బాటలో అదే జిల్లాకు చెందిన మరికొందరు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. డీకే అనుచరులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డితో పాటు ఇటీవల జరిగిన అసెంబ్లి ఎన్నికల్లో నారాయణపేట నుంచి ఎమ్మెల్యేగా పోటి చేసిన శివకుమార్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. అంతంత మాత్రంగానే పట్టున్న గ్రేటర్‌ హైదరాబాద్‌లో కూడా కాంగ్రెస్‌కు పెద్ద షాకే తగలనుంది. అసెంబ్లి ఎన్నికల ముందు మాజీ మంత్రి దానం నాగేందర్‌ కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పి టీఆర్‌ఎస్‌లో చేరి ఖైరాతాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌, ఆయన తనయుడు విక్రమ్‌గౌడ్‌ కూడా కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆ పార్టీ నేతలతోనూ చర్చలు జరిపినట్లుగా ప్రచారం జరుగుతోంది. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కూడా బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు కాంగ్రెస్‌ మాత్రం తన కార్యకర్తలకు ధైర్యం చెప్పేలా ప్రకటనలు చేస్తోంది. నాయకులు పార్టీని వీడినంత మాత్రాన కేడర్‌ ఎక్కడికి వెళ్లి పోవడం లేదని కాంగ్రెస్‌ ప్రముఖులు చెబుతున్నారు.  నాయకుల వలసలతో కాంగ్రెస్‌ కొట్టుకుపోదని తన సత్తా చాటుతుందని వారు పేర్కొంటున్నారు. ఏదీ ఏమైనా ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సత్తా చాటితేనే ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని చెబుతున్నారు.

 

Tags :