ఈ ఎన్నికల తర్వాత ఆయన విశ్రాంతి తీసుకుంటారు : రాహుల్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నిజం చెప్పారని, ఈ ఎన్నికల్లో ఓడిపోతే తాను విశ్రాంతి తీసుకుంటానని అన్నారని, అది నిజమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆర్మూర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. నీళ్లు, నిధులు, నియామకం కోసం తెలంగాణ ఏర్పడింది. ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ నెరవేరుస్తారని ఆశించాం. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కేసీఆర్ అంటే కావో కమిషన్‌రావు అని అర్థం. రాష్ట్ర సంపదను తన కుటుంబానికి వెచ్చిస్తున్నారు. రాష్ట్రంలో రూ.2.50 లక్షల కోట్ల మేర అప్పులు చేశారు. ఒక్కో పౌరుడి పేరిట రూ.2.50 లక్షల అప్పు ఉంది. ఆర్మూర్‌లో స్థానికంగా ఎన్నో సమ్యలు ఉన్నాయి.
కేసీఆర్, ఆయన కుమార్తె కవిత కూడా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ, అలా చేయలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల సమస్యలు పరిష్కారిస్తాం. 17 రకాల పంటలకు మద్దతు ధర ఇస్తాం అని అన్నారు. గబ్బర్‌సింగ్ ట్యాక్స్ జీఎస్టీని సమీక్షిస్తాం. బీడీ కార్మికులు, యాజమాన్యాలపై జీఎస్టీ భారం లేకుండా చూస్తాం. ఎన్నికల తర్వాత విశ్రాంతి తీసుకుంటానని కేసీఆర్ నిజం చెప్పారు. జరిగేది అదే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గల్ఫ్ బాధితుల సమస్యలు పరిష్కరిస్తాం. రూ.500 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తాం అని ప్రజలకు హామీ ఇచ్చారు.