పొత్తుల సెగలో కాంగ్రెస్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికార టీఆర్‌ఎస్ పార్టీని ఓడించేందుకు కంకణం కట్టుకున్న కాంగ్రెస్, ఇతర పార్టీలతో కలిసి మహకూటమిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కూటమిలో టీడిపి, సిపిఐ, టిజెఎస్ పార్టీలు ఉన్నాయి. కలిసికట్టుగా పోటీ చేసేందుకు ఓకే అన్న పార్టీలు సీట్ల విషయానికి వచ్చేటప్పుటికీ పట్టుదలకు పోతున్నాయి. దాంతో కాంగ్రెస్ ఈ సీట్ల పొత్తు సెగలో ఏమి చేయాలో తోచక కొట్టుమిట్టాడుతోంది.
పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్‌కు మిత్రపక్షాలను అన్నీ విధాల సంతప్తిపరచడం తలకు మించిన భారంగా మారింది. కాంగ్రెస్‌కు బలమైన సీట్లు, తప్పని సరిగా గెలుపొందుతామన్న ధీమా ఉన్న సీట్లనే టీడీపీ, సీపీఐ లేదా టీజేఎస్ కోరుతున్నాయి. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో, ఇప్పటి వరకు సీట్లు ఆశించిన ఆశావాహులు ఇక అక్కడ తమకు సీట్లు లభించవని, తలుపులు మూతపడ్డాయని భావించి కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్‌పై మరింత వత్తిడి పెరుగుతున్నది. ఉదాహరణకు పరకాల నియోజకవర్గం స్థానాన్ని ఇనుగాల వెంకట్రామ్ రెడ్డికి కేటాయించినప్పటికీ, తాజాగా కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్ సొంత గూటికి చేరడంతో వెంకట్రామ్‌కు టిక్కెట్ దక్కదేమోనన్న సందేహం కలుగుతున్నది. టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్వయంగా ఆ స్థానం నుంచి వెంకట్రామ్ రెడ్డి పోటీ చేస్తారని ప్రజల సమక్షంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ 15 అసెంబ్లీ సీట్లలో విజయం సాధించింది. దీంతో తమకు ఆ స్థానాల్లో బలం ఉంది కాబట్టి తిరిగి ఆ స్థానాలన్నీ కావాలని కోరడంతో కాంగ్రెస్‌కు చిక్కు ఎదురైంది.
ఉదాహరణకు ఎల్‌బీ నగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన ఆర్.కష్ణయ్య విజయం సాధించారు. ఇప్పుడు ఆ స్థానం తమకే ఇవ్వాలని టీడీపీ కోరుతుండగా, కాంగ్రెస్ పార్టీ ససేమిరా అంటున్నది. అందుకు కారణం గతంలో అక్కడి నుంచి కాంగ్రెస్ తరపున డి. సుధీర్ రెడ్డి విజయం సాధించారు. సుధీర్‌రెడ్డి బలమైన అభ్యర్థి అని కాంగ్రెస్ వాదిస్తున్నది. ఇలా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి తదితర సీట్లపై టీడీపీ పట్టుపడుతున్నది. టీడీపీ 22 సీట్లు కోరగా, సీపీఐ కూడా తమకు కొత్తగూడెం, వైరా, దేవరకొండ తదితర మొత్తం 12 సీట్లు కావాలంటున్నది. టీజేఎస్ 16 సీట్లను కోరుతున్నది. కూటమి పొత్తులు, సీట్ల సర్దుబాటు ఈ నెలాఖరుకుగానీ తేలదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.