విభిన్న అంశాలతో ఆకట్టుకునేలా నాట్స్ తెలుగు సంబరాలు
భాషే రమ్యం సేవే గమ్యం అన్న నినాదంతో తెలుగు కమ్యూనిటీకి సేవలందిస్తున్న జాతీయ తెలుగుసంఘం నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) తెలుగు సంబరాల పేరుతో వైభవంగా మహాసభలను వివిధ నగరాల్లో నిర్వహిస్తూ వస్తోంది. ఈసారి 7వ అమెరికా తెలుగు సంబరాలను మే 26 నుంచి 28వ తేదీ వరకు న్యూజెర్సిలోని న్యూ జెర్సి కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పొజిషన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నేపథ్యంలో 7వ అమెరికా తెలుగు సంబరాల కన్వీనర్ శ్రీధర్ అప్పసానితో తెలుగు టైమ్స్ చేసిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు.
ఈసారి తెలుగు సంబరాల్లో ముఖ్యమైన అంశాలేమిటీ?
కమ్యూనిటీ ఆనందించేలా, కళాకారులను ప్రోత్సహించేలా ఎన్నో కార్యక్రమాలను 7వ అమెరికా తెలుగు సంబరాల్లో ఏర్పాటు చేశాము. ఈ సంబరాల్లో స్థానిక కళాకారులను ప్రోత్సహించే కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. ఇంతవరకు తెలుగు సంఘాల చరిత్రలో ఎవరూ చేయని విధంగా పేరెంట్స్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం సంబరాలకే హైలైట్‌గా నిలుస్తుంది. మన తల్లితండ్రులను మనం గౌరవించుకునేలా ఈ కార్యక్రమం ఉంటుంది.
అమెరికాలో నాట్స్ తెలుగమ్మాయి పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా టీన్ నాట్స్ ముద్దుగుమ్మ, మిస్ నాట్స్ కిన్నెరసాని, మిసెస్ నాట్స్ కావ్యనాయకి పేరుతో పోటీలను ఏర్పాటు చేశాము. ఈ వివిధ నగరాల్లో జరిగే పోటీల్లో విజేతలుగా నిలిచినవారు అమెరికా తెలుగు సంబరాల వేదికపై గ్రాండ్ ఫైనల్ పోటీల్లో తలపడుతారు. గెలిచిన వారికి ప్రతి కేటగిరిలో నాట్స్ కిరీటంతో పాటు నగదు బహు మతులు ఇవ్వనున్నాము.
అమెరికా తెలుగు సంబరాల్లో ఈసారి ఇద్దరు ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ, థమన్‌లు తమ సంగీతంతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఎలిజియం బ్యాండ్ కూడా సంగీతంతో యువతను ఊర్రూత లూగించనున్నది.
ఇతర కార్యక్రమాలేమిటి?
ఈ అమెరికా తెలుగు సంబరాల్లో ఇతర కార్యక్రమాలు కూడా ఆకట్టుకునేలా ఏర్పాటు చేశాము. యువత కోసం ప్రత్యేకంగా జలీనియల్ అనే కార్యక్రమం, బిజినెస్ నిపుణులతో చర్చాగోష్టులు, ఉమెన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో మహిళా కార్యక్రమాలు, సదస్సులు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము.
అమెరికాలోనే తొలిసారిగా మహిళా అష్టావధానం వంటి ప్రత్యేక సాహితీ కార్యక్రమం కూడా ఈ సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. దీంతోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శ్రీనివాస కళ్యాణం వంటివి ఉంటాయి. వాలీబాల్, టెన్నిస్ టోర్నమెంట్ వంటి క్రీడా పోటీలను కూడా సంబరాలను పురస్కరించుకుని ఏర్పాటు చేశాము.
అమెరికా తెలుగు సంబరాల్లో పూర్వ విద్యార్ధుల సమ్మేళనం కూడా నిర్వహిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఎస్‌ఆర్‌కెఆర్ పూర్వ విద్యార్ధులంతా మే నెల 27 తేదీన నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో సమావేశం అవుతున్నారు.
తెలుగుటైమ్స్ ద్వారా మీరు చెప్పే సందేశమేమిటి?
నాట్స్ తెలుగువారికి మరింత చేరువయ్యేలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. భాషే రమ్యం అనే నినాదానికి తగ్గట్టుగా లలిత కళావేదిక ద్వారా కళలు, సాహిత్య కార్యక్రమాలు చేస్తోంది. సేవే గమ్యం అన్న నినాదానికి తగ్గట్టుగా తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణాభివృద్ధికి సహాయం, మన ఊరుమన బాధ్యత అనే కార్యక్రమం ద్వారా మెడికల్ క్యాంపులు, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు వంటి ఎన్నో కార్యక్రమాలను నాట్స్ తరపున చేస్తున్నాము. అమెరికాలో అతి పెద్ద వేడుకగా జరిగే తెలుగు సంబరాలకు అందరూ హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను.
ఈ సంబరాలకు ఎవరెవరు వస్తున్నారు?
* అమెరికా తెలుగు సంబరాలకు ముఖ్య అతిధులుగా సినీ నిర్మాత అల్లు అరవింద్, కెవి. రావు, రమేష్ కంచర్ల హాజరవుతున్నారు.
* గెస్ట్ ఆఫ్ హానర్లుగా జయసుధ, సాయికుమార్, ఎ. కోదండరామిరెడ్డి, చంద్రబోస్, అలీ, బి. గోపాల్, కిషోర్ కోటపల్లి వస్తున్నారు.
* టాలీవుడ్ అట్రాక్షన్స్‌గా మణిశర్మ, తమన్, శివమణి, గీతామాధురి, శ్రీకృష్ణ, పృథ్వీ, పార్థునేమాని, సింహ, హెబ్బా పటేల్, ఫరియా అబ్దుల్లా, గోపిచంద్ మలినేని, బాబి, ఆది సాయికుమార్, అవసరాల, హిమజ, శివజ్యోతి, జోర్దార్ సుజాత, వి.జె. సన్ని, రాకేష్, గంప నాగేశ్వరరావు తదితరులు వస్తున్నారు.
* ఈ సంబరాలకు పలువురు సాహితీవేత్తలు కూడా హాజరవుతున్నారు. కళ్యాణి ద్విభాష్యం, జ్యోతిర్మయి కొండవీటి, రామ జోగయ్య శాస్త్రి, జొన్నవిత్తుల, సిరాశ్రీ, మీగడ రామలింగశాస్త్రి తదితరులు వస్తున్నారు.