సుహాసిని కూకట్ పల్లిలో పోటీచేస్తే తప్పేంటి?
సుహాసిని కూకట్‌పల్లిలో పోటీ చేస్తే తప్పేంటని సీపీఐ జాతీయ నేత నారాయణ ప్రశ్నించారు. కేపీహెచ్‌బీలో సుహాసిని తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడుతూ కేపీహెచ్‌బీ బహిరంగ సభలో కూకట్‌పల్లి ప్రజాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని పోటీపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. దేశంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చన్నారు. అమెరికాలో చదివిన కేటీఆర్‌కు పోటీచేసే అర్హతల గురించి తెలియదా? అని ప్రశ్నించారు. తెలంగాణ శాసనసభను కేసీఆర్ ఎందుకు అర్థాంతరంగా రద్దు చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
కూటమి పెరు చెబితేనే కేసీఆర్, కేటీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. పరిపాలన చేతకాక 9 నెలల ముందే అసెంబ్లీని రద్దు చేశారని మండిపడ్డారు. తెలంగాణను అభివృద్ధి చేయడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిచేది ప్రజా కూటమేనని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కూకట్‌పల్లి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటే సుహాసినిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.