కరోనా కట్టడిలో ఎపి సిఎస్, డిజిపి ల పనితీరు భేష్
ఆంధప్రదేశ్‍లో కరోనా వైరస్ మరింతగా విజృంభించకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీలం సాహ్ని, రాష్ట్ర డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) గౌతమ్ సవాంగ్‍లు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ రాష్ట్రాన్ని కాపాడుతున్నారు. కరోనా వైరస్ విషయంలో వారు ముందు నుంచి అలెర్ట్ గా ఉంటూ ఇతరులను కూడా అప్రమత్తంగా ఉండేలా చూశారు. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ కరోనా వైరస్ ప్రభావాన్ని వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‍మోహన్‍రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ఇటు రాష్ట్ర ప్రజల నుంచి అటు సీఎం నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.
కరోనా వైరస్ రాష్ట్రాన్ని తాకినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‍మోహన్‍రెడ్డి రంగంలోకి దిగి ప్రజలకు రక్షణా భద్రతను కల్పించే పూర్తి బాధ్యతలు సీఎస్, డీజీపీలకు అప్పగించారు. సీఎం ఆదేశాలతో వారిద్దరు ఆయన ఆకాంక్షకు అనుగుణంగా రంగంలోకి దిగి గడిచిన 15 రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. వాస్తవానికి సీఎస్, డీజీపీల ముందస్తు ప్రణాళికల ఫలితంగానే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కరోనా ప్రభావం తక్కువగానే ఉంది. పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో బాధితుల సంఖ్య అధికంగా ఉంది. అందుకు బలమైన కారణాలు కూడా లేకపోలేదు. ఎప్పటికప్పుడు సీఎం ఆదేశాలను ఆ ఇద్దరూ ఆచరణలో అమలుపరుస్తూ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ముందస్తు సూచనలు ఇస్తూ కరోనా వైరస్ బారిన ఎక్కువమంది పడకుండా ప్రయత్నిస్తున్నారు.
పూర్తిసమయం కేటాయిస్తున్న నీలం సాహ్ని
రాష్ట్రంలో కరోనా నేపథ్యం ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని క్షణం తీరిక లేకుండా పూర్తి సమయం కరోనా పోరు కోసమే కేటాయిస్తూ వస్తున్నారు. నిత్యం రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఆయా జిల్లాల్లో కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. అలాగే కేసులు నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక ద•ష్టి సారించి పోలీసు శాఖ సహకారంతో వాటిని రెడ్ జోన్‍గా ప్రకటించి ఆ ప్రాంత ప్రజలను కరోనా నుంచి విముక్తి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే రాష్ట్ర అధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు టచ్‍లో ఉంటూ రాష్ట్రానికి అవసరమైన సహకారాన్ని, రాష్ట్రంలో చేపడుతున్న చర్యలను వారికి వివరిస్తూ కేంద్రం వద్ద రాష్ట్ర ప్రతిష్టను పెంచే ప్రయత్నాన్ని కూడా సీఎస్ చేస్తున్నారు. ప్రత్యేకంగా పది మంది సీనియర్ ఐఏఎస్ అధికారులతో కరోనా నివారణ కోసం టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వారి ద్వారా ఆయా జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ఇటు ప్రజల నుంచి అటు సీఎం నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.
సంక్షేమం...నిర్ణయాలతో డీజీపీ బిజీ
కరోనా పోరులో వైద్య ఆరోగ్య శాఖ సేవలతోపాటు పోలీసు శాఖ ఎప్పటికప్పుడు తీసుకుంటున్న కఠిన నిర్ణయాల ఫలితంగానే రాష్ట్రంలో చాలా వరకు కరోనా అదుపులో ఉందని చెప్పవచ్చు. మీరు ఇంట్లో ఉండండి .. మేము వీధుల్లో ఉంటామంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇచ్చిన సందేశం రాష్ట్ర ప్రజల్లో చైతన్యాన్ని నింపింది. ఆయన ప్రత్యేకంగా వీడియో ద్వారా రాష్ట్ర ప్రజలకు మెసేజ్‍లు కూడా పంపారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ప్రజలు ముఖ్యమైన పనులు ఉన్నవారు తప్పితే 90 శాతం మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజల రక్షణ కోసం పోలీసులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్నారు. డీజీపీ పోలీసు సిబ్బంది సంక్షేమాన్ని ద•ష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా మాస్కులు, శానిటైజర్, గ్లౌజులు పంపిణీ చేశారు. ప్రజల ప్రాణాలతో పాటు సిబ్బంది సంక్షేమంలోనూ తామెప్పుడూ ముందుంటామని ఆయన మరోసారి చాటుకున్నారు. అలాగే సీఎం జగన్ ఆదేశాలను ఎప్పటికప్పుడు ఆచరణలో అమలుపరుస్తూ రాష్ట్రంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. వీరిద్దరి పనితీరు వల్లనే రాష్ట్రంలో కరోనా వైరస్ కొన్ని చోట్లకే పరిమితమైందని చెప్పవచ్చు.