తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 5వ తేదీన ముచ్చింతల్, ఇక్రిసాట్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లపై వివధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బీఆర్కే భవన్‌లో సమావేశమై సమీక్షించారు. ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ప్రధాని మోదీ పాల్గొనే వేదికల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లతో పాటు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్త్‌ను బ్లూ బుక్ ప్రకారం ఏర్పాటు చేయాలని ఆయన పోలీసు శాఖను ఆదేశించారు. వేదికల వద్ద తగ్గు వైద్య శిబిరాలతో పాటు, నిపుణులైన వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించారు.
ప్రధాని 5వ తేదీన మధ్యాహ్నం 2:45 గంటలకు ఇక్రిశాట్‌ను సందర్శించి, సంస్థ నూతన లోగోను ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ వెళ్లనున్నారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా చినజీయర్ స్వామి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో వీవీఐపీ సందర్శన సమయంలో కోవిడ్ 19 ప్రోటోకాల్ పాటించేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిని సీఎస్ ఆదేశించారు. వీవీఐపీ పాస్ హోల్డర్లకు షెడ్యూల్ చేసిన ప్రోగ్రామ్‌కు ముందే ఆర్టీపీసీఆర్ పరీక్షలను చేపట్టాలని, కోవిడ్ 19 స్క్రీనింగ్ బృందాలను పెద్ద సంఖ్యలో సన్నద్ధం చేయాలని సూచించారు.