న్యూజెర్సిలో ఘనంగా టిఫాస్ దీపావళి
న్యూజెర్సిలోని తెలుగు కమ్యూనిటీ దీపావళి వేడుకలు అక్టోబర్ 29వ తేదీన అంగరంగ వైభవంగా జరిగాయి. తెలుగు కళాసమితి (టిఫాస్) ఆధ్వర్యంలో పిస్కటవే హైస్కూల్ ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకల్లో ఎంతోమంది పాల్గొన్నారు. సంఘం అధ్యక్షుడు గురు ఆలంపల్లి తొలుత అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెబుతూ అందరినీ ఆహ్వానించారు. న్యూజెర్సి తెలుగు ప్రముఖుడు ఉపేంద్ర చివుకులతోపాటు, ప్రముఖ రచయిత డా. వడ్డేపల్లి కృష్ణ తదితరులు ఈ వేడుకలకు అతిధులుగా వచ్చారు. దీపావళి ప్రాముఖ్యతను ఆయన వివరించారు. 'పాఠశాల' విద్యార్థులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలను అందరినీ అలరించాయి. 15కి పైగా డ్యాన్స్ స్కూల్ నుంచి వచ్చిన స్టూడెంట్లు చేసిన కార్యక్రమాలు కూడా ఆకట్టుకున్నాయి.
మ్యూజిక్ నైట్, గీతం - సంగీతం, దీపావళి డ్రామా వంటి కార్యక్రమాలతోపాటు టాలీవుడ్ గాయనీ గాయకులు పాడిన పాటలు అందరినీ మైమరపింపజేశాయి. కృష్ణ చైతన్య, లిప్సిక, ఆదర్శిణి, చంటి అందరికీ నచ్చే గీతాలను ఎంపిక చేసుకుని పాడారు. ఈ వేడుకల్లో వివిధ సంఘాల అసోసియేషన్ల నాయకులు కూడా పాల్గొన్నారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాయకులు మహేందర్ ముసుకు, మోహన్ రెడ్డి పాటలోళ్ళ, సంతోష్ పాతూరి, ప్రశాంత్ వేములగంటి, రమేష్ చంద్ర, రవి పెద్ది, బిందు తదితరులు టాటా తరపున పాల్గొన్నారు. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ తరపున ఆ సంస్థ అధ్యక్షుడు మోహన్ కృష్ణ మన్నవ తదితరులు పాల్గొన్నారు.