ఘనంగా జరిగిన డిట్రాయిట్ తెలుగు దీపావళి వేడుకలు
డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. డిసెంబర్ 3వ తేదీన వాల్డ్ లేక్ వెస్టర్న్ హైస్కూల్‌లో జరిగిన ఈ వేడుకలకు తెలుగువారు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొలుత సంఘం అధ్యక్షుడు రమేష్ పెద్దేటి వచ్చినవారికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ, అందరినీ సగౌరవంగా ఆహ్వానించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గణేశ ప్రార్థన, లక్ష్మీ అష్టోత్తరంతో వేడుకలను ప్రారంభించారు. డ్యాన్సింగ్ స్టార్స్, గబ్బర్ సింగ్ డ్యాన్స్, ది రాకర్‌జ్ (మెడ్లి), అమ్మాయిలా మజాకా, లిటిల్ స్టార్స్ గ్రూపు, ఆపిల్ బ్యూటీస్, మాచీస్, గ్లామరస్ గర్ల్స్, నార్త్ విల్లే యాంజెల్స్ డ్యాన్స్ వంటి ఎన్నో కార్యక్రమాలు వచ్చినవారిని మైమరపింపజేశాయి. ఈ వేడుకల్లోనే వడ్లమూడి వెంకటరత్నం అవార్డును శ్రీనివాస్ కోనేరుకు బహూకరించారు. డిటిఎ కమ్యూనిటీ అవార్డును సురేష్ పుట్టగుంట, చంద్ర అన్నవరపు, శైలభ్ శల్లి కుమార్‌కు ఇచ్చారు. కమ్యూనిటీ ప్రముఖులు శ్రీనివాస గోగినేని, ఉదయ్ చాపలమడుగు, జోగేశ్వరరావు పెద్దిబోయిన ఈ అవార్డులను గ్రహీతలకు ఇచ్చారు. వేడుకలను విజయవంతం చేసినవారందరికీ డిటిఎ కార్యవర్గం ధన్యవాదాలు తెలియజేసింది.