కళలకు చేయూతనిస్తున్న 'తానా' - దేవినేని ఉమ
తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ కళలను సంరక్షించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో సోమవారం తానా చైతన్యస్రవంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. గత 40 సంవత్సరాల నుంచి తానా తెలుగు ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలను చేసిందని చెప్పారు. గ్రామీణ?ప్రాంతాల్లో చేసే సేవా కార్యక్రమాలకు, సాంస్కృతిక ప్రదర్శనలకు ఎపి ప్రభుత్వం అన్నీరకాలుగా సహాయసహకారాలను అందిస్తోందని చెప్పారు. మేయర్ కోనేరు శ్రీధర్ మాట్లాడుతూ, తెలుగు ప్రాంతాలకంటే అమెరికాలోని తెలుగువారే మన సంస్కృతీ సంప్రదాయాలపై మక్కువ చూపిస్తూ సేవలు చేస్తున్నారని చెప్పారు.
తానా అధ్యక్షుడు జంపాల చౌదరి, తానా ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ గోగినేని తదితరులు మాట్లాడారు. వచ్చే సంవత్సరం మే 26, 27, 28 తేదీల్లో అమెరికాలోని సెంట్ లూయిస్ నగరంలో తానా 40వ వార్షికోత్సవంను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనికోసం తెలుగు ప్రాంతాల్లోని ప్రధాన నగరాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉత్తమ కళాకారులను వార్షికోత్సవాలకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తానా రీజినల్ వైస్ ప్రెసిడెంట్ సతీష్ వేమూరి మాట్లాడుతూ, తానా చైతన్యవేదిక కార్యక్రమంలో భాగంగా తెలుగువారి జానపద కళల పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తానా నాయకులు జయరామ్ కోమటి, ప్రసాద్ తోటకూర, సతీష్ వేమన, వెంకట్ కోగంటి, మంజుల కన్నెగంటి, రాజేష్ అడుసుమిల్లి, రాజా సూరపనేని, లావు అంజయ్య చౌదరి, రవి పొట్లూరి తదితరులు పాల్గొన్నారు.