చెన్నూరి జానకిరామ్ స్మారకార్థం జగ్గయ్యపేటలో డిజిటల్ తరగతుల ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నీరంగాల్లో నవ్యాంధ్ర ముందుకెళ్ళాలన్న ఆశయంతో ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని తలంచారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రభుత్వ స్కూళ్ళలో డిజిటల్ తరగతులను ఏర్పాటుచేసి సులువుగా నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలనుకున్నారు. అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి ఎపి జన్మభూమి కార్యక్రమాల్లో భాగంగా డిజిటల్ తరగతులను ఎన్నారైల తోడ్పాటుతో అన్నీ ప్రభుత్వ స్కూళ్ళలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. వివిధ రంగాల్లో స్థిరపడిన అనేకమంది తాము చదువుకున్న ఊర్లలో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు సహాయపడేందుకు ముందుకు వచ్చారు.
ఇందులో భాగంగా మీడియారంగంలో పేరు తెచ్చుకున్న చెన్నూరి వెంకట సుబ్బారావు తన తండ్రి చెన్నూరి జానకిరామ్ పేరుతో తాను చదువుకున్న గెంటెల వెంకట జోగయ్య జడ్పి హైస్కూల్లో డిజిటల్ తరగతిని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. 1971లో జగ్గయ్యపేటను వదలి వదలి హైదరాబాద్ కు తరలి వచ్చిన చెన్నూరి జానకిరామ్ కుటుంబం అంటే ఇప్పటికీ మరచిపోలేని వారు ఎందరో ఉన్నారు. జగ్గయ్యపేటలో ఎల్ఐసి డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా ఉన్న జానకిరామ్ సీతారామపురంలో తొలి ఇంగ్లీష్ కాన్వెంట్ చదువు వచ్చేందుకు దోహదపడ్డారు. 1969-70లో జగ్గయ్యపేట జూనియర్ కాలేజీకి ఆంధ్రయూనివర్సిటీ గుర్తింపు వచ్చేలా కూడా కృషి చేశారు. తన కుటుంబ సభ్యులకు మంచి చదువులు అందించి వారి ఉన్నతికి కృషి చేసిన చెన్నూరి జానకిరామ్ స్మారకార్థం నేడు ఆయన కుమారుడు చెన్నూరి వెంకట సుబ్బారావు జడ్పి హైస్కూల్లో డిజిటల్ తరగతి గదులను ఏర్పాటు చేసి ఇప్పటితరానికి కూడా సులువుగా నాణ్యమైన విద్య అందేలా కృషి చేశారు. చెన్నూరి వెంకట సుబ్బారావు ప్రస్తుతం అమెరికాలో తెలుగు పత్రిక 'తెలుగు టైమ్స్'ను నడపడంతోపాటు, తెలుగు భాషను నేర్పించే పాఠశాలకు కూడా సిఇఓగా వ్యవహరిస్తున్నారు.