ASBL Koncept Ambience

ప్రైవేట్‌ బడులకన్నా ప్రభుత్వ బడులే బెస్ట్‌ - సంధ్యారాణి

ప్రైవేట్‌ బడులకన్నా ప్రభుత్వ బడులే బెస్ట్‌ - సంధ్యారాణి

నాణ్యమైన విద్య ప్రైవేట్‌ బడుల్లో కన్నా ప్రభుత్వ బడుల్లోనే లభిస్తుందని రాష్ట్ర స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ శ్రీమతి సంధ్యారాణి చెప్పారు. జగ్గయ్యపేటలో ఆగస్టు 10వ తేదీన చెన్నూరి జానకిరామ్‌ స్మారకార్థం చెన్నూరి సుబ్బారావు ఇచ్చిన విరాళంతో ఏర్పాటు చేసిన డిజిటల్‌ తరగతులను ఆమె ప్రారంభించి ప్రసంగించారు. ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్న టీచర్లు అంకితభావంతో పనిచేస్తారని, దాంతోపాటు వారు లాభాన్ని ఆశించి చెప్పరని చెబుతూ, దీనివల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్ళలో డిజిటల్‌ తరగతుల ఏర్పాటును అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్‌ కోమటి జన్మభూమి కార్యక్రమంలో భాగంగా చేపట్టేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. ఎన్నారైల సహకారంతో ఆయన ఇప్పటికే పలు ప్రభుత్వ స్కూళ్ళలో డిజిటల్‌ తరగతులను ఏర్పాటు చేశారని తెలిపారు. చెన్నూరి వెంకట సుబ్బారావు తాను చదువుతున్న జగ్గయ్యపేట హైస్కూల్‌లో తన తల్లితండ్రుల స్మారకార్థం డిజిటల్‌ తరగతుల ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయమని చెప్పారు.

జయరామ్‌ కోమటి మాట్లాడుతూ, ఎన్నారైల సహకారంతో ఇప్పటికే దాదాపు 2400 స్కూళ్ళలో డిజిటల్‌ తరగతులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇంకా 2600 స్కూళ్ళలో కూడా డిజిటల్‌ తరగతులను ఏర్పాటు చేస్తామని కూడా తెలిపారు. 5,000 డిజిటల్‌ తరగతుల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నట్లు జయరామ్‌ కోమటి చెప్పారు.

తెలుగుటైమ్స్‌ ఎడిటర్‌, డోనర్‌ చెన్నూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ, ఈరోజు నా జీవితంలో మరపురాని రోజు అని, తన తల్లితండ్రుల స్మారకార్థం నేను చదువుకున్న స్కూల్‌కు ఉపయోగపడేలా డిజిటల్‌ తరగతులను ఏర్పాటు చేసే అవకాశం లభించడం అదృష్టమని చెప్పారు. తన తండ్రి చెన్నూరి జానకిరామ్‌ 1960లో ఇక్కడ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌, జూనియర్‌ కాలేజీ ఏర్పాటుకు కృషి చేశారని చెప్పారు. ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలని, జీవితంలో స్థిరపడాలన్న తన తండ్రి ఆశయం వల్లనే తాము కూడా మంచి చదువులు చదివి నేడు ఉన్నత స్థితికి చేరుకున్నామని, తన తండ్రి కోరుకున్నట్లుగానే తాము కూడా విద్యాలయాలకు ఏదైనా చేయాలన్న తలంపుతో ఇప్పుడు డిజిటల్‌ తరగతులను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినట్లు చెప్పారు. ఇదే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధికి కూడా తనవంతుగా శాయశక్తులా పాటుపడుతానని కూడా హామి ఇచ్చారు. ఎమ్మెల్యే శ్రీరామ్‌రాజగోపాల్‌ మాట్లాడుతూ, స్కూల్‌లో మరిన్ని క్లాస్‌రూమ్‌లు అవసరమని, టీచర్లకు వెయిటింగ్‌ రూమ్‌లు కావాలని కోరారు. హెడ్‌మిస్ట్రెస్‌ జ్యోతి, ఎమ్మెల్సీ ఎఎస్‌ రామకృష్ణ, స్టాఫ్‌ సెక్రటరీ బడే నాగేశ్వరరావు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు. అంతకుముందు డిజిటల్‌ తరగతులను ప్రారంభించిన తరువాత కమిషనర్‌ సంధ్యారాణి ఇక్కడి స్కూల్‌లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందువల్ల మరో 3 డిజిటల్‌ తరగతులు కూడా ఉండాల్సిన అవసరం కనిపిస్తోందని చెప్పారు. దీనికి స్పందించిన జయరామ్‌ కోమటి నెలల్లోగానే ఈ 3 డిజిటల్‌ తరగతులను కూడా ఏర్పాటు చేయిస్తానని హామి ఇచ్చారు.

 

Click here for PhotoGallery

 

Tags :