ASBL Koncept Ambience

వికలాంగుల కష్టాలు తీర్చే వైకుంఠం-“విర్డ్” ఆసుపత్రి

వికలాంగుల కష్టాలు తీర్చే వైకుంఠం-“విర్డ్” ఆసుపత్రి

ఒక లక్షా 20వేలకు పైగా అంగవికలురకు విజయవంతంగా ఎముకల శస్త్రచికిత్సలు నిర్వహించిన ప్రముఖ వైద్యుడు డా.గుడారు జగదీష్ నేతృత్వంలో పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో నిర్వహిస్తున్న వెంకటేశ్వర అంగవైకల్య శస్త్రచికిత్స పరిశోధనా పునరావాస ఆసుపత్రికి(Venkateswara Institute For Rehabilitation & Research of the Disabled-VIRRD) డల్లాస్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ప్రవాసులు ₹60లక్షలను విరాళంగా ప్రకటించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్)లు ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించాయి. కార్యక్రమాన్ని తానా ప్రాంతీయ ప్రతినిధి దొడ్డా సాంబ ప్రారంభించారు.

తానా డైరక్టర్ల బోర్డు కార్యదర్శి వెన్నం మురళీ మాట్లాడుతూ నిస్వార్థంగా పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న డా.గుడారు జగదీష్ వంటి వారి ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్న ఆసుపత్రికి డల్లాస్ ప్రవాసులు తోడ్పడం ఆనందంగా ఉందన్నారు. తానా మాజీ అధ్యక్షుడు డా.తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ 2013లో డల్లాస్‌లో జరిగిన తానా సభల్లో డా.గుడారుకి పురస్కారాన్ని అందించి గౌరవించుకున్నామని, 2017లో ఏలూరులో జరిగిన అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరో పురస్కారంతో ఆయన్ను రెండుసార్లు గౌరవించుకునే అవకాశం దక్కిందని అన్నారు. అకుంఠిత దీక్షతో, క్రమశిక్షణ, సాంత్వన కలిగిన మాటతీరుతో అంగవైకల్యం బాధపడే లక్షల మంది జీవితాల్లో ఆనందాన్ని నింపి వారి సొంత కాళ్లపై వారు నిలబడేలా చేసిన దేవుడు డా.గుడారు అని ఆయన కొనియాడారు. అనంతరం డా.జగదీష్‌ను తోటకూర సభకు పరిచయం చేశారు. డా.గుడారు జగదీష్ తన ప్రసంగాన్ని ప్రదర్శన రూపంలో వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…”1987లో ఎన్‌టీఆర్ తిరుపతిలో స్థాపించిన BIRRD ఆసుపత్రిలో నేను 1996 నుండి 1,20,000 మంది అంగవికలాంగులకు 95శాతం విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించాను. 2008లో వేగేశ్న ఫౌండేషన్, ద్వారకా తిరుమల ఆలయం సహకారంతో VIRRDను ఏర్పాటు చేసి ఇక్కడ కూడా ఎంతోమందికి ఎముకలకు సంబంధించిన శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రంలో 23వేల మంది అంగవికలాంగులకు శస్త్రచికిత్సలు, కృత్రిమ అవయవాల అవసరం ఉంది. దీనితో పాటు VIRRD ఆసుపత్రిలో అధునాతన శస్త్రచికిత్స గది, రోగులకు మంచాలు, గ్రంథాలయం, ఫిజియోథెరపీ ఉపకరణాలు వంటి వాటిని ఆధునీకరించాల్సిన ఆవశ్యకత ఉంది. జనవరి నుండి తొలివిడతలో ఏపీలో, తదనంతరం తెలంగాణా రాష్ట్రాల్లో VIRRD ఉచిత నిర్ధారణ శిబిరాలను నిర్వహించి అర్హులైన వారికి స్థానిక వైద్యుల సహకారంతో స్థానికంగానే చికిత్స చేస్తాం లేదా VIRRDకు తరలించి అక్కడే అవసరమైన మేర చికిత్స చేస్తాం. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా తమ ప్రాంతంలో ఈ శిబిరాలను నిర్వహించాలంటే VIRRDను సంప్రదించండి. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారందరికీ పూర్తి ఉచితంగా ఎలాంటి శస్త్రచికిత్సను అయినా VIRRDలో అందిస్తున్నాం. రోగి VIRRDలోనే రెండు నుండి ఆరు వారాల పాటు ఉచితంగా భోజన సదుపాయంతో కూడిన నివాసంలో ఉండవచ్చు. తోడుగా ఒక కుటుంబ సభ్యుడు ఉండవచ్చు. రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల రోగులు సైతం మా VIRRDకు వస్తున్నారు. ఏడాదికి 50వేల మంది రోగులకు మేము వైద్య సదుపాయాలను కల్పిస్తున్నాం. ఇంతమంది రోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న VIRRDను మరింత మెరుగుపరిచేందుకు నిధులను సేకరిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రవాసులు తోడ్పడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.” అని డా.జగదీష్ పేర్కొన్నారు.

తానా మాజీ అధ్యక్షుడ్ కోమటి జయరాం ₹35లక్షలు, మురళీ వెన్నం సమన్వయంలో డల్లాస్ మిత్రులు ₹15లక్షలు, తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్ ₹10లక్షలు VIRRDకు అందించేందుకు హామీ ఇచ్చారు. వీరందరికీ డా.గుడారు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టాంటెక్స్ అధ్యక్షుడు చినసత్యం వీర్నపు, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు సుబ్బరాయ చౌదరి, చిత్తూరు ప్రవాసుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల విజయమోహన్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో తానా క్రీడా విభాగ సమన్వయకర్త లోకేష్ నాయుడు, పోలవరపు శ్రీకాంత్, జొన్నలగడ్డ సుబ్రమణ్యం, మల్లవరపు అనంత్, డా.పుదూర్ జగదీశ్వరన్, యు.నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Click here for Photogallery

 

Tags :