విధేయతే నా బలం... ఎన్నికల్లో గెలుస్తాం : అధ్యక్ష అభ్యర్థి నరేన్ కొడాలి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో దాదాపు 2 దశాబ్దాలకు పైగా ఉన్న అనుభవం, వివిధ పదవులను నిర్వహించి తానాలో అందరికీ పరిచయం ఉన్న నరేన్ కొడాలి ప్రస్తుతం జరుగుతున్న తానా ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్నారు. తానాలో చిన్న పదవుల నుంచి బోర్డ్ చైర్మన్ వరకు వివిధ పదవులను చేపట్టడంతో పాటు సభ్యులకు, కమ్యూనిటీకి మంచి ఎలా చేయాలో బాగా తెలిసిన వ్యక్తి, దానికితోడు ప్రొఫెషనల్‌గా ప్రొఫెసర్ పదవిని నిర్వహిస్తున్న నరేన్ కొడాలి ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, వీడియోల ద్వారా, డైరెక్టుగా సభ్యులతో, టీమ్‌తో మమేకమై పని చేస్తున్నారు. ఎన్నికలను పురస్కరించుకుని తెలుగు టైమ్స్ ఆయనను ఇంటర్వ్యూ చేసినప్పుడు పలు విషయాలను వెల్లడించారు.
తానాతో మీకున్న అనుబంధం చెప్పండి?
తానాతో నాకు 2 దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. 2005 నుంచి తానాలో వివిధ పదవులను చేపట్టాను. 2005లో తానా ఐటీ కమిటీ కో చైర్‌గా పని చేసిన తరువాత కాన్ఫరెన్స్ చైర్మన్‌గా, బోర్డ్ డైరెక్టర్‌గా, చైర్మన్‌గా కూడా పదవులను నిర్వహించాను. తానా బైలాస్ కమిటీ మెంబర్‌గా, లీగల్, ఇతర వ్యవహారాల కమిటీల్లో కూడా పనిచేసిన అనుభవంతో తానాకు మరింతగా సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్నాను.
ప్రస్తుత ఎన్నికల్లో మీ నినాదం ఏమిటి?
విధేయత, విశ్వసనీయత, ప్రభావంతమైన సేవ అన్న నినాదంతో నేను ఎన్నికల బరిలో దిగాను. ప్రతి సంవత్సరం తానాలో కొత్త సభ్యులు వస్తున్నారు. కొత్త కార్యక్రమాలను చేస్తున్నారు. కమ్యూనిటీకి ఎప్పుడు ఏది అవసరమో అది చేయగల సత్తా ఒక్క తానాకే ఉంది. అలాంటి బలమైన తానాలో వర్గాల కారణంగా వివాదాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో వివాదాలకు అతీతంగా తానాకు విధేయంగా ఉన్నవారినే ఎన్నుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ ఎన్నికల్లో నేను నా టీమ్‌తో పాటు పోటీకి దిగాను. ఈ ఎన్నికల్లో నా స్లోగన్‌ను మీరు గమనించే ఉంటారు. అలాగే తానాని కమ్యూనిటీకి మరింత దగ్గర ఎలా చేయాలన్న దానిపైనే నా దృష్టి ఉంటుంది. అదే నా ఆలోచన.. అభ్యర్థన కూడా.
ఎన్నికల్లో జాప్యానికి కేసులే కారణమా?
తానాలో ఎప్పుడూ ప్రజాస్వామ్యయుతంగానే ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. గతంలో వివాదాలు లేకుండా మన పెద్దలు ఎన్నికలను ప్రజాస్వామ్యబద్దంగానే జరిపారు. ఇటీవలి కాలంలో తానాలో వచ్చిన మార్పులు ఎన్నికలపై కూడా పడటంతో వివాదాలకు కూడా అస్కారం ఏర్పడిరది. తాను ఎల్లప్పుడూ సభ్యుల హక్కులను కాపాడాలన్న ఉద్దేశ్యంతోనే కోర్టుకు ఎక్కాల్సి వచ్చింది. ఏకపక్ష నిర్ణయాల వల్ల సభ్యులు తమ హక్కులను కోల్పోరాదు. దానిని వ్యతిరేకించడం తప్పుకాదు.
మీ ఎన్నికల మేనిఫెస్టో ఏమిటి?
తానాకు ఎల్లప్పుడూ ప్రయోజనం కలిగించేలా నా విధానాలు ఉంటాయి. అందులో భాగంగానే ఈ ఎన్నికల్లో గెలిస్తే తానాకు ఉపయోగపడేలా పలు పనులను చేపట్టనున్నాను. అందులో ఒకటి తానాకు అమెరికాలో శాశ్వత భవనం నిర్మించడం. ఇందుకోసం విరాళాలను సేకరించడంతోపాటు నా సొంత నిధులకింద 100కె డాలర్లు ఇవ్వనున్నాను. 250 కె డాలర్లను విరాళంగా సేకరిస్తాను. తానాలో అత్యధిక మంది సభ్యులు ఎఫ్ 1, హెచ్ 1 బి వీసాలపై అమెరికాకు వలస వచ్చినవారు. వీరికోసం ప్రత్యేకంగా లాయర్లతో శాశ్వత ప్రత్యేక న్యాయసేవల విభాగాన్ని ప్రారంభిస్తాము. ఇందుకోసం తన సొంత నిధులు 50కె డాలర్లు విరాళంగా అందించనున్నాను. అమెరికాలోనే పుట్టి పెరిగిన యువతీయువకులను కూడా తానాకు చేరువ చేసే ప్రణాళికలో భాగంగా పోటీ పరీక్షలకు మార్గనిర్దేశకత్వం, శిక్షణ, సన్నద్ధత వంటి కార్యక్రమాలకు కూడా ఏర్పాటు చేస్తాను. దీనికి కూడా తన సొంత నిధులు 50కె డాలర్లను మూలధనంగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తాను. ఆచార్యుడిగా నా అనుభవాన్ని ఈ కార్యక్రమ విజయవంతానికి వినియోగిస్తాను. ఇదే మా ఎన్నికల మేనిఫెస్టో.
ప్రస్తుత ఎన్నికల తీరుపై మీ స్పందన?
ప్రస్తుత ఎన్నికలపై కూడా వివాదాలు వస్తున్నాయి. మేము చెప్పేదేమిటంటే ఇలాంటి వివాదాలు రాకుండా ఉండాలంటే కోర్టు ఆదేశాలతో ఏర్పాటు అయిన మాజీ బోర్డు ఆధ్వర్యంలో కాకుండా కోర్టు నియమించిన ఓ తటస్థ సంస్థ ద్వారా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాము. తద్వారా మధ్యవర్తుల ప్రమేయం, ఆశ్రిత పక్షపాతానికి దూరంగా పారదర్శకతకు దగ్గరగా ఎన్నికలు జరుగుతాయి.