విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో అమెరికాలో దుర్గమ్మ పూజలు
అమెరికాలోని భక్తుల కోరిక మేరకు విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో వివిధ నగరాల్లో దుర్గమ్మ పూజలను నిర్వహిస్తున్నట్లు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎండోమెంట్స్ జాయింట్ కమిషనర్ దర్బముళ్ళ భ్రమరాంబ అన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి పై కొలువుండి నిత్యం వేలాది భక్తులకు దర్శనం ఇస్తున్న దుర్గమ్మ వారు అమెరికాకి వచ్చి అక్కడ పట్టణాలలో ఉన్న గుడులలో భక్తులకు దర్శనం ఇచ్చి, పూజలు చేసుకొనే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె వివరించారు.
* శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నుంచి నలుగురు పూజారులు అమెరికా వచ్చి అక్కడ గుడులలో విజయవాడ నుంచి తీసుకువచ్చిన శివపార్వతులకు, అమ్మవార్లకు పూజలు నిర్వహిస్తారని అక్కడ నిర్ణయించిన గుడి యాజమాన్యం ఇచ్చే సూచనలు బట్టి అమ్మవారి కుంకుమ పూజలు, హోమాలు, కళ్యాణాలు చేస్తామని భక్తులంత ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆమె కోరారు.
* ఈ కార్యక్రమాల్లో భాగంగా అమ్మవారికి లలిత సహస్రనామ కుంకుమార్చనలు, శ్రీచక్రపూజ, చండీహోమం, శివ పార్వతి కళ్యాణం చేయనున్నట్లు ఆమె వివరించారు.
* ఈ కార్యక్రమాల నిర్వహణకోసం విజయవాడ కనకదుర్గ దేవాలయం నుంచి ఐదుగురు పూజారులు వస్తున్నారని ఆమె చెప్పారు. శ్రీ శంకర శాండిల్య, శ్రీకోట ప్రసాద్, శ్రీ గోపాల కృష్ణ, శ్రీ సుబ్రహ్మణ్య శర్మ పూజలు నిర్వహించేందుకోసం అమెరికాకు వస్తున్నారని ఆమె తెలిపారు.
అమెరికాలో టీటీడి శ్రీనివాస కళ్యాణం, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు, కనకదుర్గ అమ్మవారి పూజలను గతంలో చేసినట్లుగానే ఈసారి కూడా అమెరికాలోని పలు నగరాల్లో విజయవాడ దుర్గమ్మవారి పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాము. ఇందులో భాగంగా ఇప్పటికే వివిధ నగరాల్లో ఉన్న దేవాలయాల నిర్వాహకులతో మాట్లాడి ఆయా దేవాలయాల్లో ఈ దుర్గ పూజలను నిర్వహిస్తున్నాము.
మే 26వ తేదీన శాన్ హోసేలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంతో ఈ పూజలు ప్రారంభమవుతాయి. 26,27,28 తేదీల్లో ఈ దేవాలయంలో పూజా కార్యక్రమాలు, కళ్యాణం, శ్రీ చక్రార్చన వంటి కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే మే 29,30,31 తేదీల్లో లాస్ ఏంజెల్స్‌లోని శ్రీ శివకామేశ్వరి టెంపుల్‌లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. జూన్ 2,3,4 తేదీల్లో న్యూజెర్సిలోని సాయిదత్తపీఠం, శ్రీ శివవిష్ణు టెంపుల్‌లో కార్యక్రమాలు జరుగుతాయి. జూన్ 5,6,7 తేదీల్లో బాల్టిమోర్‌లో ఉన్న షిర్డీసాయిమందిర్‌లో కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఇంకా మరికొన్ని దేవాలయాలతో మాట్లాడుతున్నాము. త్వరలో వాటి వివరాలను కూడా అందిస్తాము.