ASBL Koncept Ambience

ఈవీఎంల విషయంలో అప్రమత్తంగా ఉండాలి: విజయవాడ సెంట్రల్ లో చంద్రబాబు

ఈవీఎంల విషయంలో అప్రమత్తంగా ఉండాలి: విజయవాడ సెంట్రల్ లో చంద్రబాబు

వీవీప్యాట్లలో స్లిప్పులు లెక్కించాల్సిందే!
లెక్కించడానికొచ్చిన ఇబ్బంది ఏంటి?
జగన్ లోటస్ పాండ్ లో ఉంటేనే మంచిది
రైతులకు, మహిళలకు, యువతకు, చిన్నారులకు అందరికీ అండగా నిలుస్తానని, తాను అందరివాడ్నని, కొందరివాడ్ని కాదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ప్రజల ప్రాణాల కంటే తనకు డబ్బు ముఖ్యం కాదని, ప్రజల కోసం ఎంత చేయాలో అంతా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో మనకు అడ్డుపడుతున్నది టీఆర్ఎస్ అని అన్నారు. టీఆర్ఎస్ ఏ టీమ్ అయితే కోడికత్తి పార్టీ బీ టీమ్ అని ఆరోపించారు. ఈ సందర్భంగా, ఐపీఎస్ అధికారుల బదిలీపైనా సీఎం స్పందించారు. ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి నీతిమంతులైన అధికారులపై ఫిర్యాదు చేసినవాళ్లు అవినీతిపరులని, ఏ1, ఏ2 వెళ్లి కంప్లెయింట్ చేస్తే 24 గంటల్లో చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు. తప్పులేకపోయినా ఆ అధికారులను బదిలీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈవీఎంలలో అక్రమాలు జరిగే అవకాశాలున్నాయని సాధారణ ప్రజలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. వీవీప్యాట్లలో ఉండే స్లిప్పులను ఎందుకు లెక్కించరు? మీకొచ్చిన ఇబ్బంది ఏంటి? ఎందుకు బుకాయిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. హత్యారాజకీయాలు చేసే జగన్ లోటస్ పాండ్ లోనే ఉంటే మంచిదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోదీ, కేసీఆర్, జగన్ వంటి దుర్మార్గులందరూ కలిసి రాష్ట్రంపై పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి పట్టుకున్న ప్లకార్డును తాను తీసుకున్న చంద్రబాబు దాన్ని అందరికీ చూపించారు. ఓ సామాన్యుడిలోనే ఇంత అసహనం ఉందని, ఈవీఎంలలో అక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు.

 
Tags :