నిజామాబాద్ పోలింగ్.. ఈవీఎంలతోనే
ఈ నెల 11న లోక్‌సభ ఎన్నికలు జరగనున్న విషయం విదితమే. నిజామాబాద్‌లో ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రం (ఇవిఎం)ల ద్వారానా లేక బ్యాలట్ పద్దతిలో ఎన్నిక నిర్వహిస్తారా అన్న విషయమై నెలకొన్న అనుమానాలకు తెర పడింది. నిజాబాబాద్‌లో ఇవిఎంల ద్వారానే పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఇసి) నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సిఇఒ)కి ఆదేశాలు జారీ చేసింది. ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పసుపు, ఎర్రజోన్న రైతులు కలిపి మొత్తం 185 మంది బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో పోలింగ్ బ్యాలెట్‌తో చేపడతారా? ఈవీఎంలతో నిర్వహిస్తారా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. చివరకు ఈవీఎంలతోనే నిర్వహించేందుకు ఈసీ మొగ్గు చూపింది. ఎం-3 రకం ఇవిఎంలను, బ్యాలట్, కంట్రోల్ యూనిట్లు, వివి ప్యాట్‌లు సరఫరా చేయాలని ఇసిఐఎల్‌ను ఇసి ఆదేశించింది. 26820 బ్యాలట్ యూనిట్లు, 2240 కంట్రోల్ యూనిట్లు, 2600 వివిప్యాట్ యంత్రాలు అందజేయాలని ఇసి ఆదేశించినట్లు సమాచారం. 185 మంది అభ్యర్థులకు ఇప్పటికే ఈసీ ఎన్నికల గుర్తులు కేటాయించింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు మధుయాష్కీ (కాంగ్రెస్), అరవింద్ (బీజేపీ), కె.కవిత (టీఆర్‌ఎస్)ల గుర్తులను తొలి మూడు స్థానాల్లో ఈసీ కేటాయించింది.