జనసేనలో చేరిన సీబీఐ మాజీ డైరెక్టర్
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ జనసేన పార్టీలో చేరారు. ఐపీఎస్ అధికారిగా ఎన్నో ప్రతిష్టాత్మక కేసుల్ని విచారించి, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన తొలిసారి ప్రజాజీవితంలోకి వస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన అడుగులు ఏ పార్టీవైపు పడతాయనేది ఇన్నాళ్లూ సృష్టత రాలేదు. చివరకు పవన్ కల్యాణ్ ఆహ్వానం మేరకు జనసేనలో చేరి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది. విశాఖపట్నం నుంచి జనసేన తరపున పార్లమెంటుకు లక్ష్మీనారాయణ పోటీ చేయనున్నట్లు సమాచారం. అక్కడ కాకపోతే కాకినాడ పార్లమెంటు నుంచి పోటీ చేస్తారని జేడీ సన్నిహితులు తెలిపారు. అయితే పవన్ కల్యాణ్ ఆయనను రాయలసీమ ప్రాంతం నుంచి పోటీ చేయాలని కోరారు. దీంతో ఎక్కడ నుంచి లక్ష్మీనారాయణ బరిలో ఉంటారనేది తేలలేదు. కర్నూలు లేదా నంద్యాల స్థానం నుంచి పోటీ చేయించాలనేది పవన్ ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన మాత్రం విశాఖపట్నం వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అక్కడైతే ఉన్న విద్యావంతులు, కేంద్ర ప్రభుత్వ ఉగ్యోగులతో పాటు వివిధ రాష్ట్రాల వారు ఉంటారు కాబట్టి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.