ASBL Koncept Ambience

తెలుగు భాష.. ప్రపంచ భాష కావాలనేదే నా కోరిక : వెంకయ్య నాయుడు

తెలుగు భాష.. ప్రపంచ భాష కావాలనేదే నా కోరిక : వెంకయ్య నాయుడు

తెలుగు రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గారిని తానా మహాసభల వేదికపై సన్మానించారు. వెంకయ్య నాయుడు గారు తన కెరీర్‌లో చేసిన సేవలను గుర్తించిన న్యూజెర్సీ అసెంబ్లీ, సెనేట్ ఒక తీర్మానం చేశాయి. దీన్ని న్యూజెర్సీ కౌన్సిల్‌మెన్ స్టర్లీ స్టాన్లీ చేతులమీదుగా వెంకయ్య నాయుడు అందుకున్నారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాల నడుమ తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ రవిపొట్లూరి, బోర్డు చైర్మన్ బండ్ల హనుమయ్య, ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ శృంగవరపు, వెలువల శ్యాంబాబు, డాక్టర్ కామినేని శ్రీనివాస్, తానా కార్యవర్గం సభ్యులు తదితర తానా నేతలు అందరూ కలిసి వెంకయ్య నాయుడు గారిని సత్కరించారు.  

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘తెలుగు సంస్కృతిని ఖండఖండాంతరాలకు విస్తరిస్తున్న వారిని చూస్తుంటే తనకు చాలా గర్వంగా ఉంది. ఎన్నో రంగాల్లో నిష్ణాతులైన మీరు అమెరికాలో కూడా పేరు ప్రఖ్యాతులు సాధిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అమెరికాలో తెలుగు భాష, సంస్కృతిసంప్రదాయల పరిరక్షణ కోసం తానా చేస్తున్న కృషి అభినందనీయం’ అని చెప్పారు. ‘మనం ఏ దేశంలో ఉంటే ఆ దేశ సంస్కృతిని, ప్రభుత్వాలను అన్నింటినీ గౌరవించాలి. అందుకని మాతృభూమిని మర్చిపోకూడదు. భాషను మర్చిపోతే శ్వాసను మర్చిపోయినట్లే. ఎన్ని భాషలు నేర్చుకున్నా అమ్మ భాషను మర్చిపోకూడదు’ అని తెలిపారు. 

అలాగే మనకు చదువు చెప్పిన గురువును కూడా మర్చిపోకూడదన్నారు. గూగుల్ వచ్చినా గురువును మర్చిపోకూడదని, గూగుల్ పోతే గురువే దిక్కని చెప్పారు. అందరూ కలిసి భాషను కాపాడుకోవాలన్నారు. తెలుగు భాష ప్రపంచ భాష కావాలనేదే తన ఆకాంక్ష అన్నారు. ఈ తెలుగు భాష పరిరక్షణ కోసం తానా వంటి సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయి, అయితే వ్యక్తిగతంగా కూడా భాషను కాపాడేందుకు కృషి చేయాలన్నారు. ప్రస్తుతం యువతలో ఒక తప్పుడు ఆలోచన ఉందని, ఇంగ్లిష్ రాకపోతే కెరీర్‌లో ఉన్నత శిఖరాలు అందుకోలేమని ఫీలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన గురించే ఉదాహరణ ఇచ్చారు. ‘భారత రాష్ట్రపతి ముర్ము మాతృభాషలో చదువుకున్న మనిషి. ఉపరాష్ట్రపతిగా చేసిన నేను. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా సేవలందించిన ఎన్వీ రమణ, ప్రధాని నరేంద్ర మోదీ.. వీళ్లంతా కూడా మాతృభాషలో చదువుకున్న వారే’ అని చెప్పారు. 

అలాంటి భాషను కాపాడుతున్న తానాకు కృతజ్ఞతలు చెప్పారు. ప్రపంచంలోని టాప్-100 బడా కంపెనీల్లో కనీసం యాభై కంపెనీల్లో సీఈవోలుగా భారతీయులు, తెలుగు వాళ్లే ఉన్నారని వెంకయ్య నాయుడు గుర్తుచేశారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావును గుర్తుచేసిన ఆయన.. ఎవరికైనా శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆరే గర్తుకు వస్తారని చెప్పారు. ఎన్నో విభిన్నపాత్రల్లో ఆయన మెప్పించారన్నారు. ‘అలాంటి గొప్ప వ్యక్తిని తానా మహాసభల సందర్భంగా గుర్తు చేసుకోవడం సంతోషంగా ఉంది. ఆయన కోసం ప్రత్యేకంగా పెట్టిన ఎగ్జిబిషన్ కూడా చాలా బాగుంది’ అని పేర్కొన్నారు. ఈ మహాసభలు ఇంత గొప్పగా నిర్వహించిన తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి, కోఆర్డినేటర్ రవి పొట్లూరి, ఇతర తానా నాయకులు అందరికీ అభినందనలు తెలిపారు.

 

 

 

Tags :