ASBL Koncept Ambience

బే ఏరియాలో ఘనంగా జరిగిన అభినందన వేడుక

బే ఏరియాలో ఘనంగా జరిగిన అభినందన వేడుక

బే ఏరియా ఇండియన్‌ కమ్యూనిటీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ నాయకుడు, అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులైన జయరామ్‌ కోమటిని ఘనంగా సన్మానించారు. కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌లో ఉన్న లావిష్‌ మారియట్‌ హోటల్‌లో ఈ వేడుక జరిగింది. ఆయన అభిమానులు, స్నేహితులు ఈ అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు అమెరికా ప్రముఖులు కూడా హాజరవడం విశేషం.

బాటా సలహాదారు విజయ ఆసూరి తొలుత ప్రముఖులను ఆహ్వానిస్తూ కార్యక్రమాలను ప్రారంభించారు. బెట్టి ఈ (సిఎ స్టేట్‌ ట్రెజరర్‌), ఆర్‌.ఓ. ఖన్నా (డిప్యూటీ సెక్రటరీ ఆఫ్‌ కామర్స్‌), బిల్‌ క్వార్క్‌ (సిఎ అసెంబ్లీ), బిల్‌ హారిసన్‌ (ఫ్రీమాంట్‌ మేయర్‌), కాన్సెన్‌ చు (సిఎ అసెంబ్లీ), జోస్‌ ఎస్టీవ్స్‌ (మిల్‌పిటాస్‌ మేయర్‌), రోస్‌ హెరెరా (శాన్‌హెసె సిటీ కౌన్సిల్‌), యాష్‌ కల్రా (శాన్‌హోసె సిటీ కౌన్సిల్‌) తదితరులు జయరామ్‌ కోమటిని అభినందిస్తూ కొత్త బాధ్యతల్లో కూడా ఆయన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

యుఎస్‌ కాంగ్రెస్‌ ఉమెన్‌ తులసీ గబ్బర్డ్‌ కూడా జయరామ్‌ను అభినందిస్తూ, అమెరికా - ఇండియా మధ్య సంబంధాలను మరింత మెరుగుపరిచేందుకు ఇండియన్‌ కమ్యూనిటీకి ఎల్లవేళలా మద్దతుగా ఉంటానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ఈ వేడుకకు ప్రత్యేక అతిధిగా హాజరై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున జయరామ్‌ కోమటిని ఘనంగా సత్కరించారు.

జయరామ్‌ కోమటి మాట్లాడుతూ తనపై అభిమానం చూపుతున్నవారందరికీ ధన్యవాదాలు తెలియజేయడంతోపాటు ఈ గుర్తింపు తనకు ఒక్కడికే కాదని, మాతృరాష్ట్రంకోసం కష్టపడే ప్రతి తెలుగుఎన్నారైలు కూడా ప్రభుత్వ ప్రతినిధులేనని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు లోకేష్‌ తనపై నమ్మకంతో ఈ బాధ్యతలను తనకు అప్పగించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నవ్యాంధ్ర ప్రగతికి కృషి చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. మాతృరాష్ట్ర ప్రగతికోసం ఎన్నారైలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా జయరామ్‌ కోమటి పిలుపునిచ్చారు. తానా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ నాయకులు జంపాల చౌదరి (ప్రెసిడెంట్‌), సతీష్‌ వేమన (వైస్‌ ప్రెసిడెంట్‌), జే తాళ్ళూరి (తానా ఫౌండేషన్‌) తదితరులు కూడా జయరామ్‌ కోమటిని సన్మానించారు. బాటా ఎగ్జిక్యూటివ్‌ టీమ్‌ కూడా జయరామ్‌ కోమటికి అభినందనలు తెలియజేస్తూ, ఆయనకు మద్దతుగా నిలుస్తామని ప్రకటించింది. ఎన్నారై టీడిపి, శంకర ఐ ఫౌండేషన్‌, లివర్‌మోర్‌ టెంపుల్‌, సన్నివేల్‌ టెంపుల్‌, హెచ్‌ఎస్‌ఎస్‌, సిలికానాంధ్ర, తెలంగాణ అసోసియేషన్‌, వేదా టెంపుల్‌, పాఠసాల, ఆంధ్రాముస్లిం  అసోసియేషన్‌, పంజాబ్‌ అసోసియేషన్‌, స్వాగత్‌ ఫ్రెండ్స్‌ ప్రతినిధులు తదితరులు కూడా జయరామ్‌ను సన్మానించారు.

చివరన తానా రీజినల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సతీష్‌ వేమూరి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం జయప్రదం చేసేందుకోసం దాదాపు 3వారాలుగా ఎంతోమంది స్నేహితులు, వలంటీర్లు కష్టపడ్డారని వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలో తెలుగు కమ్యూనిటీకి తగిన గుర్తింపు తీసుకురావడంలో జయరామ్‌గారి శక్తిసామర్థ్యాలు తక్కువకావని అంటూ, జయరామ్‌గారికి అభినందనలు తెలియజేశారు.


Click here for Event Gallery

 

Tags :