ASBL Koncept Ambience

భారీ పెట్టుబడులు పెట్టనున్న ఫిష్ఇన్ కంపెనీ

భారీ పెట్టుబడులు పెట్టనున్న ఫిష్ఇన్ కంపెనీ

తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి మరో కంపెనీ ముందుకు వచ్చింది. ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఎగుమతి చేసే ఫిష్‌ ఇన్‌ కంపెనీ తెలంగాణలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. అమెరికాలో మంత్రి కేటీఆర్‌తో సమావేశం అనంతరం కంపెనీ సీఈఓ మనీష్‌ కుమార్‌ ఈ మేరకు ప్రకటించారు. రూ. వెయ్యి కోట్లతో పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్‌ ఫ్రెష్‌ వాటర్‌ ఫిష్‌ కల్చర్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేయనున్నామని వెల్లడించారు. దీంతో ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్‌ మానేరు రిజర్వాయర్‌ వద్ద ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కంపెనీ కార్యకలాపాలను ప్రారంభిస్తామని మనీష్‌ కుమార్‌ తెలిపారు.

చేపల ఉత్పత్తిలో హ్యాచరీలు, దాణా తయారీ, కేజ్‌ కల్చర్‌, ఫిష్‌ ప్రాసెసింగ్‌ మరియు ఎగుమతుల వంటి అనేక విభాగాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తామన్నారు. కంపెనీ పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ప్రతి ఏడాది రాష్ట్రం నుంచి సుమారు 85 వేల మెట్రిక్‌ టన్నుల చేపలను ఎగుమతి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టనున్న ఫిష్‌ ఇన్‌ కంపెనీకి మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. దీంతో రాష్ట్రంలో మత్స్య పరిశ్రమకి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నైపుణ్యం అందివస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ పెట్టుబడి ద్వారా సుమారు 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. తెలంగాణ యువతకు ముఖ్యంగా మత్స్య పరిశ్రమ పై ఆధారపడిన వారికి, మిడ్‌ మానేరు నిర్వాసితులకు ప్రాధాన్యత ఇవ్వాలని కంపెనీకి సూచించామని చెప్పారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ తో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ డైరెక్టర్‌ అఖిల్‌ పాల్గొన్నారు.

 

Tags :