విశాఖకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్..
ఫిన్‌టెక్, డేటా సెంటర్స్, ప్రాసెసింగ్ రంగాల్లో విస్తరించేందుకు గాను ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టాలని ఈ రంగంలో అగ్రగామి సంస్థ అయిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ చాలా ఉత్సుకతతో వుంది. ఆ సంస్థ ప్రెసిడెంట్, సిఓఓ జెన్నిఫర్ జాన్సన్ అమెరికా పర్యటనలో వున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంగళవారం సమావేశమయ్యారు. తాము హైదరాబాద్ కేంద్రంగా భారతదేశంలో గత కొంత కాలం నుంచి ఎంతో సౌకర్యవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని జెన్నిఫర్ వివరించారు. హైదరాబాద్‌లో అతిపెద్ద ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కార్యనిర్వాహక కేంద్రం ఏర్పాటుకు అప్పట్లో తమరు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు సహకరించారంటూ చంద్రబాబుకు ఈ సందర్భంగా జెన్నిఫర్ కృతజ్ఞతలు తెలిపారు.
తమ ప్రతినిధులు విశాఖలో ఇటీవల జరిగిన ఫిన్‌టెక్ సదస్సుకు హాజరయ్యారని, ఆ సదస్సు తమకు భరోసా కలిగించిందని చెప్పిన జెన్నిఫర్ విశాఖలో మీరు సముద్రం అభిముఖంగా మంచి ప్రదేశాన్ని చూపిస్తే మేము క్యాంపస్ ఏర్పాటుకు సిద్ధంగా వున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌ను తీర్చిదిద్దన తమరి నాయకత్వంపై మాకు పూర్తి విశ్వాసం వుందంటూ ముఖ్యమంత్రిని కొనియాడారు. అంతకుముందు విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించడానికి అవసరమైన అత్యున్నత పరిజ్ఞానం ఉందా అని జెన్నిఫర్ సందేహం వ్యక్తం చేయగా, అటువంటి అనుమానాలు ఏవీ పెట్టుకోవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మొత్తం ప్రపంచంలో ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయులు వున్నారని, వారిలో ఒకరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వారేనని చెప్పారు. మీరు నిర్భయంగా మీ కార్యకలాపాలు ప్రారంభించవచ్చని జెన్నిఫర్‌కు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. అత్యున్నత పరిజ్ఞానం, తెలివితేటలు విషయంలో తమ రాష్ట్రం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ హబ్‌గా మారుస్తున్నామని, తమ యువత అత్యంత సమర్ధత, నైపుణ్యం కలిగివుందని, ఎలాంటి సందేహం వద్దని ముఖ్యమంత్రి చెప్పారు.
మేము మీకు భూమి, నీరు, విద్యుత్ ఇలా అన్నీ సమకూరుస్తామని, మీరు నేతృత్వం వహించి ముందుగా రాష్ట్రంలో కేంపస్ నెలకొల్పాలంటూ జెన్నిఫర్‌కు ముఖ్యమంత్రి సూచించారు. మిమ్మల్ని మిగిలిన సంస్థలు అనసరిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెడతాయని అన్నారు. దీనికి సంతృప్తి చెందిన జెన్నిఫర్ విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌లో అత్యుత్తమ ప్రతిభ, డేటా అనలిటిక్స్, ప్రాసెసింగ్ అందుబాటులో వున్నాయనే విషయాన్ని తమ బోర్డుకు వివరిస్తానని చెప్పారు. ఫిన్‌టెక్ డెవలప్‌మెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేయగలమని జెన్నిఫర్ ముఖ్యమంత్రికి తెలిపారు.
క్లౌడ్ మౌలిక సదుపాయాలు, టెలికాం కేరియర్స్ సామర్ధ్యం, బ్రాండ్ బ్యాండ్ కనెక్టివిటీ గురించి జెన్నిఫర్ ప్రస్తావించగా, తాము రాష్ట్రంలో ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి ఫైబర్ కనెక్టివిటీ అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు గూగుల్ ఎక్స్‌తో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. విశాఖలో ఎకో సిస్టమ్ అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో తాము విస్తరణ చేపట్టేందుకు సిద్ధంగా వున్నామని, అయితే ఏ ప్రదేశంలో నెలకొల్పాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని జెన్నిఫర్ చెప్పారు.