కాలిఫోర్నియాలో డిజిటల్ తరగతుల కోసం వెల్లువెత్తిన విరాళాలు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటులో ఎన్నారైల భాగస్వామ్యంకోసం అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీమతి సంధ్యారాణి, అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి ఆదివారంనాడు కాలిఫోర్నియాలో ఎన్నారైలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి చేస్తున్న కృషిని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు ఎన్నారైలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పాఠశాల స్కూల్ కమిషనర్ శ్రీమతి సంధ్యారాణి ప్రభుత్వ స్కూళ్ళకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం చేస్తున్న పనులను ఎన్నారైలకు తెలియజేశారు.
ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి కూడా జన్మభూమి అభివృద్ధికి ఎన్నారైలు ముందుకు రావడంతోపాటు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగస్వాములవ్వాలని కోరారు. మంత్రి బృందం చేసిన వినతికి ఎన్నారైలు వెంటనే స్పందించడంతోపాటు దాదాపు 250 ప్రభుత్వ స్కూళ్ళలో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు ముందుకు వచ్చారు. హనిమిరెడ్డి తొలుత 10 స్కూళ్ళలో తరగతుల ఏర్పాటుకు ముందుకురాగా వెనువెంటనే చాలామంది ఎన్నారైలు తాము కూడా రెడీయేనంటూ వచ్చారు. జెపి తదితరులు కూడా ఈ తరగతుల ఏర్పాటులో ఉన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తరపున 500 స్కూళ్ళలో డిజిటల్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేయనున్నారు.
ఈ సమావేశం విజయవంతమయ్యేలా తానా రీజినల్ వైస్ ప్రెసిడెంట్ సతీష్ వేమూరి కృషి చేశారు. ఈ కార్యక్రమంలో బాటా నాయకులు, సభ్యులతోపాటు తానా నాయకులు కూడా హాజరయ్యారు.