న్యూజెర్సీలో మహా గాయకుడు ఘంటసాల వర్థంతి
న్యూజెర్సీలో మహా గాయకుడు ఘంటసాల వర్థంతి జరిగింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), జీఎస్‌కేఐ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందలాదిమంది పాల్గొని గాన గంధర్వునికి ఘనంగా నివాళులర్పించారు. ఘంటసాల అందించిన గానామృతాలను ఆలపించి పరవశించిపోయారు. ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి.. ఆ పాత మధురాలను స్మరించుకున్నారు.
పారవశ్యంతో గాన గంధర్వుని మధుర గీతాలను ఆలపించి ఆయన పాటలకు నృత్యం చేసి అలరించారు. తెలుగుపాటను ప్రపంచవ్యాప్తం చేయడంలో ఆయన చేసిన కృషిని మరువలేమన్నారు న్యూజెర్సీ తానా రీజనల్ కో ఆర్డినేటర్ రాజా కసుకుర్తి. తన్మయత్వంతో ఆయన పాడిన భక్తి గీతాలు తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. తెలుగు భాషకు వరం.. ఘంటసాల స్వరమన్నారు మధు అన్న. ఆయన పాటలను యువతరానికి అందించాలన్నదే జీఎస్‌కేఐ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. న్యూయార్క్ తానా రీజినల్ కోఆర్డినేటర్ సుమంత్ రామిశెట్టి మాట్లాడుతూ తెలుగు కళలకి, సంస్కృతికి తానా తోడ్పాటు ఎప్పుడు ఉంటుందని చెప్పారు.
ఈ సభకు విచ్చేసిన అందరు తెలుగు వారికీ తానా చేస్తున్న కృషిని కొనియాడారు. సతీష్ వేమన ఆధ్వర్యంలో జరిగిన తానా 2019 మహా సభలలో ఘంటసాల గురుంచి ప్రస్తావించటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి గారి ప్రోత్సాహాన్ని అభినందించారు. ఈ కార్యక్రమానికి సహకారాన్ని అందించిన తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు, తానా కార్యదర్శి రవి పొట్లూరి, తానా అంతర్జాతీయ సమన్వయకర్త లక్ష్మి దేవినేని, తానా కార్యవర్గ సభ్యులకు అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో న్యూజెర్సీ పబ్లిక్ సర్వీస్ యుటిలిటీస్ కమీషనర్ ఉపేంద్ర చివుకుల, సాయిదత్త పీఠం ఆచార్యులు రఘు శంకరమంచి, దాము గేదల, సుధాకర్ ఉప్పాల, శ్రీనివాస్ గూడూరి, శివ కనకమేడల, రేఖ ఉప్పులూరి, విజయ నాదెళ్ల, లక్ష్మి మోపర్తి, ప్రసాద్ కునసెట్టి, ప్రవీణ్ గూడూరు, ప్రవీణ్రెడ్డి, సాయి పాలేటి, రవి మాచర్ల, సుధీర్ నారెపలుపు పాల్గొన్నారు