ఘనంగా "గీత" ఉగాది వేడుకలు
ఇండియానాపొలిస్‌లో తెలుగువాళ్ళు దుర్ముఖినామ సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. గ్రేటర్ ఇండియానా పొలిస్ తెలుగు అసోసియేషన్ (గీత) ఆధ్వర్యంలో దుర్ముఖినామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏప్రిల్ 23వ తేదీన వెస్ట్‌ఫీల్డ్ హైస్కూల్‌లో జరిగిన ఈ వేడుకలకు దాదాపు 500 మందికిపైగా తెలుగువాళ్ళు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. టాలీవుడ్ నుంచి వచ్చిన గాయనీ గాయకులు దింకర్, సుమంగళి పాడిన పాటలు, స్థానిక కళాకారుల ప్రదర్శనలు వచ్చినవారిని ముగ్దులను చేశాయి.
గవర్నర్ మైక్ పెన్స్ తరపున ఆయన సలహాదారు దిగోమారల్స్, స్టేట్ రిప్రజెంటెటివ్ దొన్నా షహైబ్లీ, కార్మెల్ సిటీ మేయర్ జిమ్ బ్రైనార్డ్, ఐహెచ్‌ఎస్‌సిసి ప్రెసిడెంట్, ఎఎఐఎన్‌పిఎసి ప్రెసిడెంట్ రాజు చింతల ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. గీత ప్రెసిడెంట్ నవీన్ సిరిగిరి వచ్చినవారికి ఉగాది శుభాకాంక్షలను తెలియజేయడంతోపాటు గీత తరపున నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఉగాది వేడుకలను అద్భుతంగా నిర్వహించిన 'గీత' టీమ్‌ను అందరూ అభినందించారు.