మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన నోవార్టిస్ సీఈవో వసంత్ నరసింహన్
హైదరాబాద్‌లోని కార్యాలయం తమకు రెండో అతిపెద్ద కార్యాలయంగా మారిందని అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం నోవార్టిస్ ప్రకటించింది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన నోవార్టిస్ సీఈవో వసంత్ నరసింహన్... రాష్ట్రంలో విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ప్రారంభించిన స్వల్ప కాలంలోనే అద్భుతమైన వృద్ధిని సాధించిందన్న ఆయన... భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మల్టీ నేషనల్ ఫార్మా కంపెనీల్లో తమ క్యాపబిలిటీ సెంటర్ అతి పెద్దదని తెలిపారు. స్విట్జర్లాండ్ బాసెల్‌లోని తమ కేంద్ర కార్యాలయం తర్వాత సుమారు 9 వేల మంది ఉద్యోగులతో హైదరాబాద్ కేంద్రం రెండో అతి పెద్ద కార్యాలయంగా మారిందని వివరించారు. హైదరాబాద్‌లో ఉన్న ఇన్నోవేషన్, నైపుణ్యం కలిగిన మానవ వనరుల వల్లే ఇది సాధ్యమైందన్న నరసింహన్... ఈ కేంద్రాన్ని తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా, డిజిటల్ కార్యక్రమాలకు ఆసియా పసిఫిక్ కేంద్రంగా ఎంచుకున్నట్లు నోవార్టిస్ సీఈవో వసంత్ నరసింహన్ తెలిపారు.
కంపెనీ వృద్ధిపై అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్.. కేంద్ర కార్యాలయానికి వెలుపల హైదరాబాద్ అతిపెద్ద కార్యక్షేత్రంగా మారడం అత్యంత సంతోషదాకరమని అన్నారు. నోవార్టిస్ విస్తరణతో తెలంగాణ లైఫ్ సైన్స్ రంగానికి ఎంతో మేలు చేకూరుతుందని కేటీఆర్ తెలిపారు. నోవార్టిస్ వల్ల ప్రపంచ లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ ఒక అగ్రశ్రేణి, ఆకర్షణీయ పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని చెప్పారు. హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుందన్న కేటీఆర్... హైదరాబాద్‌లో భారీగా విస్తరించిన నోవార్టిస్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు.