లాస్ ఏంజెలిస్ లో జయరామ్ కు ఘనసన్మానం
ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన ప్రముఖ ఎన్నారై, కమ్యూనిటీ నాయకుడు జయరామ్ కోమటిని లాస్‌ఏంజెలిస్‌లోని ఎన్నారైలు ఘనంగా సన్మానించారు. డాక్టర్ కాంతి, జయదేవ్ అప్పనగరి ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 300 మందికిపైగా ఎన్నారైలు, కమ్యూనిటీ నాయకులు ఈ వేడుకకు హాజరయ్యారు. జయరామ్ కోమటి కమ్యూనిటీకి చేసిన సేవలను ప్రసంగించిన వక్తలంతా కొనియాడారు. తానా లాంటి సంస్థతోపాటు మరిన్ని సంస్థలకు నాయకత్వం వహించి లీడర్‌షిప్ ప్రతిభను తెలియజేశారని, అదే విధంగా అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకోసం ప్రత్యేకంగా 'తెలుగు టైమ్స్' పత్రికను ప్రచురిస్తున్నారని, తెలుగు చిన్నారులకోసం 'పాఠశాల'ను నిర్వహిస్తున్నారని వారు పేర్కొన్నారు.
శరత్ కామినేని మాట్లాడుతూ, అమెరికాలోని ఎన్నారై తెలుగువారి సంక్షేమంతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగువారి అభ్యున్నతికి కూడా జయరామ్ కోమటి పాటుపడగలరన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. రాయుడు కొత్తపల్లి మాట్లాడుతూ, తెలుగు కమ్యూనిటీని ముందుకు నడిపించగల సత్తా జయరామ్‌లో ఉందని చెప్పారు. జయదేవ్ అప్పనగరి మాట్లాడుతూ, జయరామ్ నిరాడంబరత్వం, మరోవైపు నాయకత్వ ప్రతిభ ఆయనకు గుర్తింపును తీసుకువచ్చాయన్నారు. రావు యలమంచిలి జయరామ్‌ను శాలువాతో, పుష్పగుచ్ఛంతో ఘనంగా సత్కరించారు. శరత్, రాయుడు, లక్ష్మీచుండు, కుమార్ కోనేరు, జయదేవ్ తదితర నాయకులు, తెలుగు కమ్యూనిటీ సంస్థలు, పాఠశాల బృందం జయరామ్‌ను ఘనంగా సన్మానించాయి.
ఈ సందర్భంగా జయరామ్ కోమటి మాట్లాడుతూ, లాస్‌ఏంజెలిస్‌లోని ఎన్నారైలు తనపై చూపిన ఆదరాభిమానాలకు కృతఙతలని చెప్పారు. కమ్యూనిటీకి ఉపయోగపడేలా తాను కార్యక్రమాలను చేస్తానని చెప్పారు. తాను ఓ గ్రూపుకు, లేదా ఓ సంస్థకు పరిమితమైనవాడిని కానని, అన్నీ వర్గాలవారు, అన్నీ సంఘాలవారు తనకు ఒకటేనని చెప్పారు. అమెరికాలోని తెలుగువాళ్ళందరి సంక్షేమానికి పాటుపడటంతోపాటు, మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు, అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు ఈ పదవిని ఇవ్వడం ద్వారా తనపై మరింత బాధ్యతను పెంచారని అందుకు ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.
ఇయానా సంస్థ వ్యవస్థాపకురాలు లక్ష్మీ చుండు, నందన్ కుమార్ పొట్లూరి, సురేష్ కందెపు లాస్ ఏంజెలిస్ రీజియన్ తానా కో ఆర్డినేటర్, సురేష్ అయినంపూడి తదితర వలంటీర్లు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. నాటా, ఇయానా, టాటా, ఆటా, లాటా, టిఎఎస్‌సి తదితర సంస్థల ప్రతినిధులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. జయదేవ్ చివరన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సంగం గ్రూపు వారు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.