సియాటెల్ లో కుంకుమార్చనల పూజలకు భారీ స్పందన
సియాటెల్ లోని హిందూ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్‌లో జరుగుతున్న విజయవాడ శ్రీ కనకదుర్గ కుంకుమార్చనల పూజలకు మంచి స్పందన కనిపించింది. ఏప్రిల్ 29వ తేదీన జరిగిన ప్రారంభ పూజలో ఎంతోమంది భక్తులు పాల్గొన్నారు. విజయవాడ నుంచి ప్రత్యేకంగా వచ్చిన పూజారులు శంకర శాండిల్య, లింగంభొట్ల దుర్గాప్రసాద్, శంకరమంచి ప్రసాద్, గోపాలకృష్ణలతోపాటు విజయవాడ ఆలయ పిఆర్‌ఓ అచ్చుతరామయ్య, రాష్ట్ర దేవాదాయశాఖ జాయింట్ డైరెక్టర్ సాయికుమార్‌తోపాటు హెచ్‌టిసిసి ఆలయ నిర్వాహకులు ఈ కార్యక్రమం జయప్రదంగా జరిగేలా చూశారు. భక్తుల చేత శాస్త్రోక్తంగా అమ్మవారి కుంకుమార్చనలతోపాటు, త్రిశతి, ఖడ్గమాల, లలితాసహస్రనామ పారాయణం వంటివి చేయించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు అమ్మవారి ప్రసాదంతోపాటు డాలర్, శేషవస్త్రాలను బహూకరించారు. ఈ కుంకుమార్చనలు ఆదివారం కూడా జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. భక్తులంతా ఈ పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులను అందుకోవాలని వారు కోరారు. ఇతర సమాచారం కోసం ఆలయ వెబ్‌సైట్ https://www.htccwa.org/ ను చూడంది.