దావోస్‌లో కేటీఆర్ పర్యటన విజయవంతం
హ్యుందాయ్ పెట్టుబడి రూ.1,400 కోట్లు
దక్షిణ కొరియాకు చెందిన ఆటోమోటివ్ దిగ్గజం హ్యుందాయ్ తెలంగాణలో రూ.1,400 కోట్ల పెట్టుబడి పెట్టనున్నది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల సందర్భంగా హ్యుందాయ్ సీఐవో యంగ్చో చి తెలంగాణ పెవిలియన్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావుతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ క్లస్టర్‌లో రూ.1,400 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడిరచారు. ఈ పెట్టుబడితో టెస్ట్ ట్రాక్‌లతోపాటు ఎకో సిస్టమ్‌కు అవసరమైన ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో భాగస్వామిగా ఉండేందుకు అంగీకరించారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఉన్న ఇతర అవకాశాలపై చర్చించారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన హ్యుండాయ్ కంపెనీకి సంపూర్ణ సహకారం అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ పెట్టుబడి రాష్ట్ర మొబిలిటీ రంగానికి బలాన్ని ఇస్తుందని చెప్పారు. హుండాయ్ రాకతో మరిన్ని పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ వ్యాలీలో భాగస్వామిగా ఉండాలని నిర్ణయించుకొన్న హ్యుండాయ్‌కి ధన్యవాదాలు తెలిపారు.
207 కోట్లతో టీబీ కిట్ల తయారీ కేంద్రం
క్షయ (టీబీ) వ్యాధి నిర్ధారణ కిట్లను తయారు చేసేందుకు హైదరాబాద్‌లో గ్లోబల్ ప్రొడక్షన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనున్నట్టు స్వీడన్ సంస్థ ఈఎంపీఈ డయాగ్నస్టిక్స్ ప్రకటించింది. దశలవారీగా రూ.207 కోట్ల (25 మిలియన్ యూరోల) పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించింది. తొలుత రూ.25 కోట్ల పెట్టుబడితో జీనోమ్ వ్యాలీలో ప్రారంభించనున్న కేంద్రంలో నెలకు 20 కిట్లను తయారు చేయనున్నట్టు కంపెనీ వ్యవస్థాపక సీఈవో డాక్టర్ పవన్ అసలాపురం దావోస్‌లో మంత్రి కేటీఆర్‌కు వివరించారు. దీనికి అదనంగా మరో రూ.50 కోట్ల పెట్టుబడితో 150 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్టు చెప్పారు. ఐదు దేశాల్లో క్లినికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాత తమ యూనిట్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకొన్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లో తయారయ్యే కిట్లను ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తామ న్నారు. యూనిట్ ఏర్పాటుకు సహకరిస్తున్న మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈఎంపీఈకి పూర్తి సహకారం: కేటీఆర్
క్షయ వ్యాధిపై జరుగుతున్న పోరాటంలో ఈఎంపీఈ డయాగ్నస్టిక్స్ ముందు వరుసలో ఉండటం సంతోషకరమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. టీబీపై హైదరాబాద్ కేంద్రంగా పోరాడబోతున్న ఈఎంపీఈ డయాగ్నస్టిక్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ విభాగం డైరెక్టర్ శక్తి ఎం నాగప్పన్ పాల్గొన్నారు.
28 కోట్లతో జీఎంఎం ఫాడ్లర్ విస్తరణ
హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ కంపెనీ తమ కేంద్రాన్ని విస్తరించనున్నది. గ్రాస్-లైన్ పరికరాల ఉత్పత్తిలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జీఎంఎం ఫాడ్లర్ రూ.28 కోట్ల (37 లక్షల డాలర్ల) పెట్టుబడితో హైదరాబాద్ యూనిట్‌ను విస్తరించనున్నట్టు ప్రకటించింది. దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్ సమావేశాల్లో భాగంగా జీఎంఎం ఫాడ్లర్ ఇంటర్నేషనల్ బిజినెస్ సీఈవో థామస్ కెప్ల్‌ా, దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ డైరెక్టర్ అశోక్ జే పటేల్ తెలంగాణ పెవిలియన్‌లో పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. తమ విస్తరణ ప్రణాళికలో హైదరాబాద్‌కే తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టులోనూ భాగస్వామిగా ఉండేందుకు జీఎంఎం ఫాడ్లర్ ఆసక్తి వ్యక్తం చేసింది. రసాయన, ఔషధ, ఆహారం, విద్యుత్తు తదితర రంగాల పరిశ్రమలకు అవసరమయ్యే పరికరాల తయారీలో ప్రత్యేకించి గ్లాస్ రియాక్టర్, ట్యాంక్, కాలమ్‌ల తయారీలో కంపెనీ ప్రపంచ ఖ్యాతి పొందింది. గ్లాస్ లైనింగ్ పరికరాల ఉత్పత్తి కోసం ఈ సంస్థ రెండేండ్ల క్రితం హైదరాబాద్‌లో దాదాపు రూ.49 కోట్ల (63 లక్షల డాలర్ల)తో తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. అక్టోబర్ 2020-మార్చి 2022 మధ్య కాలంలో ఈ యూనిట్ వివిధ దేశాలకు 700 పరికరాలను ఎగుమతి చేసింది. ఇప్పుడు మరో 37 లక్షల డాలర్లతో హైదరాబాద్ కేంద్రాన్ని విస్తరించనుండటంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 300కు పెరుగుతుంది. ఫార్మా రంగంలోని అపార అవకాశాల కోసం తాము భారత్ వైపు చూస్తున్నామని, ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో హైదరాబాద్ యూనిట్ కీలక పాత్ర పోషిస్తుందన్న నమ్మకంతో ఉన్నామని థామస్ కెప్ల్‌ా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఫార్మా పరిశ్రమలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోగలమని ధీమా వ్యక్తం చేశారు.
మాస్టర్‌కార్డ్‌తో తెలంగాణ ఎంవోయూ
తెలంగాణలో డిజిటలైజేషన్‌ను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్‌కార్డుతో అవగాహన ఒప్పందం చేసుకొన్నది. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచస్థాయి పౌరసేవలను అందించేందుకు ప్రభుత్వం మాస్టర్‌కార్డ్‌తో భాగస్వామి కానున్నది. దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్ సమావేశాల సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు, మాస్టర్ కార్డ్ వైస్ చైర్మన్, ప్రెసిడెంట్ మైఖేల్ ఫ్రోమాన్ సమక్షంలో ఈ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకొన్నారు. డిజిటలైజేషన్ ద్వారా పౌరసేవలను వేగవంతం చేసేందుకు ఈ ఒప్పదం దోహదపడుతుందని.. చిన్న, మధ్య తరహా వ్యాపారాలు, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందని అధికారవర్గాలు తెలిపాయి. పంపిణీ, వ్యవసాయ సైప్లె చెయిన్ డిజిటలీకరణ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ లిటరసీ తదితర ప్రాధాన్య రంగాల్లో మాస్టర్‌కార్డ్ రాష్ట్రానికి సహకరిస్తుంది. డిజిటల్ తెలంగాణ విజన్‌లో ప్రపంచస్థాయి సంస్థలు భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు. పౌరసేవలు మరింత మెరుగుపడటమే కాకుండా ఆర్థిక అక్షరాస్యత, సంక్షేమ పథకాల పంపిణీ, చెల్లింపుల్లో ఈ భాగస్వామ్యం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. మాస్టర్‌కార్డ్ ప్రపంచం సమగ్రమైన, సుస్థిరాభివృద్ధి సాధించడంలో సహకరించడానికి కట్టుబడి ఉన్నదని మైఖేల్ ఫ్రోమాన్ పేర్కొన్నారు. తమ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో పనిచేసే అవకాశం లభించడం సంతోషంగా ఉన్నదని చెప్పారు.
స్మార్ట్ ఎలక్ట్రిక్ సొల్యూషన్స్ దిగ్గజం ష్నైడర్
స్మార్ట్ ఎలక్ట్రిక్ ఆటోమేషన్, డిజిటల్ సొల్యూషన్స్‌లో ప్రసిద్ధిపొందిన ష్నైడర్ ఎలక్ట్రిక్ అంతర్జాతీయంగా టాప్ బ్రాండ్. పారిస్ సమీప పట్టణం రూయిల్ మాల్‌మైసన్ ప్రధాన కేంద్రంగా నడుస్తున్న ఈ సంస్థ 115 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మనదేశంలో పలు ఉత్పత్తులను తయారు చేస్తున్నది. హైదరాబాద్, బెంగుళూరుల్లో స్మార్ట్ ప్లాంట్‌లు ఉన్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం ష్నైడర్ ప్రపంచవ్యాప్త ఎగుమతుల్లో సగం భారత్ నుంచే జరుగుతున్నాయి. ఫ్రాన్స్, బోస్టన్ (యూఎస్), చైనాల తర్వాత భారత్ ఇప్పుడు ష్నైడర్‌కు ఇంటర్నేషనల్ హబ్‌గా ఉంది.
రాష్ట్రానికి రండి.. రోచె చైర్మన్‌కు కేటీఆర్ ఆహ్వానం
ఫార్మారంగంలో అత్యుత్తమ గమ్యస్థానంగా ఎదిగిన హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాలని.. ఔషధాల తయారీ, డయాగ్నొస్టిక్స్‌లో ప్రపంచ అగ్రగామి సంస్థ రోచె చైర్మన్ డాక్టర్ క్రిస్టోఫ్ ఫ్రాంజ్‌ను ఐటీ పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఆహ్వానించారు. దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో క్రిస్టోఫ్‌తో భేటీ అయిన మంత్రి కేటీఆర్.. ఫార్మారంగంలో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి, ఎకో సిస్టం గురించి వివరించారు. హైదరాబాద్‌లో ఫార్మాసిటీ, జీనోమ్‌వ్యాలీ, మెడ్‌టెక్ పార్క్ వంటి ప్రాజెక్టుల గురించి పేర్కొన్నారు. నాణ్యమైన మందుల అభివృద్ధి, రోగుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతను తెలియజేశారు. రోచె ప్రపంచంలోనే అతిపెద్ద బయోటెక్ కంపెనీ. ఫార్మాస్యూటికల్స్, డయాగ్నోస్టిక్స్‌లో అగ్రగామి సంస్థ. ముఖ్యంగా విట్రో డయాగ్నొస్టిక్స్, టిష్యూ-బేస్డ్ క్యాన్సర్ డయాగ్నొస్టిక్స్‌కు ప్రసిద్ధి చెందింది. ఆంకాలజీ, ఇమ్యునాలజీ, ఇన్ఫెక్షన్ల ద్వారా వచ్చే వ్యాధులు, ఆప్తాల్మాలజీ, కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు విభిన్నరకాల ఔషధాలను అభివృద్ధి చేస్తుంది. అంతేకాకుండా మధుమేహం నియంత్రణలోనూ ముందున్నది. డౌ జోన్స్ సస్టెయినబిలిటీ ఇండెక్స్(డీజేఎస్‌ఐ)లో ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో పదేండ్లపాటు గ్రూప్ లీడర్‌గా గుర్తింపు పొందింది.
ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీపై దావోస్‌లో చర్చించిన కేటీఆర్
దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఏఐ ఆన్ ద స్ట్రీట్: మేనేజింగ్ ట్రస్ట్ ఇన్ ద పబ్లిక్ స్క్వేర్ అన్న అంశంపై జరిగిన చర్చలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అనుసంధానమైన ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వాడకంపై ఉన్న సవాళ్ల అంశాన్ని మంత్రి కేటీఆర్ తన మాటల్లో ప్రస్తావించారు. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వాడకంపై ప్రజల విశ్వాసాన్ని జయించాల్సి ఉందని ఆయన అన్నారు. ఫేషియల్ డేటా వినియోగం విషయంలో ప్రభుత్వం నిష్పక్షతపాతంగా వ్యవహరిస్తుందని అన్నారు. అవసరం అయితే తప్పా పౌరులపై నిఘా ఉండదన్నారు. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వినియోగంలో ఉన్న అవరోధాలను అధిగమించేందుకు ప్రభుత్వ వ్యవస్థల మధ్య ఉన్న నియంత్రిత అధికారాలను గుర్తించాలన్నారు. పార్లమెంటరీ పద్ధతిలో ఆ ప్రభుత్వ సంస్థలకు చాలా పారదర్శకంగా అధికారాలను అప్పగించాలన్న అభిప్రాయాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. ఫేషియల్ రికగ్నిషన్ వల్ల భౌతిక వనరులపై ఆధారపడడం తగ్గిందని, నేరస్తులతో పాటు తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడంలో ఈ టెక్నాలజీ వల్ల సమయం తగ్గిందని మంత్రి తెలిపారు. సరైన ఫేషియల్ రికగ్నిషన్ రెగ్యులేటరీ వ్యవస్థతో పోలీసులకు, పౌరులకు అవసరమైన పనులను సులువు చేయవచ్చు అని మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు.
సేల్స్‌ఫోర్స్ సీఎఫ్‌వో అమీ వీవర్‌తో...
డబ్ల్యూఈఎఫ్ సమావేశాల్లో భాగంగా కేటీఆర్‌ను కలిసిన సేల్స్‌ఫోర్స్ సీఎఫ్‌వో అమీ వీవర్ ట్విట్టర్‌లో.. ‘రెండేండ్ల తర్వాత కేటీఆర్‌ను కలుసుకోవడం సంతోషంగా ఉన్నది. ప్రపంచానికి హైదరాబాద్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మీ నాయకత్వానికి కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.
హిటాచీ ఇండియా ఎండీ భరత్ కౌషల్ దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో ఆర్‌అండ్‌డీ విస్తరణతోపాటు హైస్పీడ్ రైల్ సిస్టమ్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి హిటాచీ బృందానికి ఆహ్వానం పలికారు.
భారతదేశ అగ్రగామి ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ సహ-వ్యవస్థాపకులు రవీంద్రన్, దివ్య గోకుల్‌నాథ్ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అభ్యసన కేంద్రాల ఏర్పాటు, నిరుపేద పిల్లలకు మెరుగైన విద్యను అందుబాటులోకి తేవడం, తెలంగాణ ప్రభుత్వ సమన్వయంతో బైజూస్ చేపట్టనున్న కార్యక్రమాలు తదితర అంశాలపై ఈ సందర్భంగా వారు చర్చించారు.
నోవార్టీస్ కంపెనీ సీఈవోతో సమావేశం
ఫార్మా దిగ్గజం నోవార్టీస్ కంపెనీ సీఈవో నరసింహన్‌తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. సంస్థ తన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన కొద్దిరోజుల్లోనే.. ప్రపంచంలోనే తమ కంపెనీకి రెండో అతి పెద్ద కార్యాలయంగా ఎదగడం పట్ల నరసింహన్ సంతోషం వ్యక్తంచేశారు.
డెలాయిట్, హెచ్‌సీఎల్, ఎన్‌ఈపీ, ఎయిర్‌టెల్, భారత్‌ఫోర్జ్.. ఇలా ఒకదాని తరువాత ఒకటిగా పలు కంపెనీల ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. వివిధ కంపెనీల ప్రతినిధులతో పెట్టుబడు లపై చర్చలు జరుపుతూనే.. వరల్డ్ ఎకనమిక్ ఫోరం చర్చా గోష్ఠుల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
భారీ పెట్టుబడితో వచ్చిన ఆశీర్వాద్
పైపులు, ఫిట్టింగ్స్ వంటి ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీలో అంతర్జాతీయ ఖ్యాతి గడిరచిన ఆశీర్వాద్ పైప్స్ (అలియాక్సిస్ గ్రూపు) సంస్థ రాష్ట్రంలో రూ.500 కోట్ల పెట్టుబడితో తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దావోస్‌లో పరిశ్రమల శాఖ మంత్రి తారకరామారావు సమక్షంలో సంస్థ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకొన్నారు. తెలంగాణ నుంచే తమ ఉత్పత్తులను ఇతరదేశాలకు ఎగుమతి చేయాలని సంస్థ నిర్ణయించింది. ప్రపంచ ఆర్థిక వేదిక సమావే శాలు రెండో రోజున తెలంగాణ పెవిలియన్‌లో అలియాక్సిస్ కంపెనీ సీఎఫ్‌వో కోయెన్ స్టికర్.. మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు.
అనంతరం స్టికర్ మాట్లాడుతూ.. తాము ఏర్పాటు చేయనున్న ప్లాంట్ ద్వారా స్టోరేజీ, డిస్ట్రిబ్యూషన్ పైప్స్, ఫిట్టింగ్స్ వంటి ప్లాస్టిక్ ఉత్పత్తులను తయారుచేస్తామని, దేశీయ మార్కెట్ల కోసం మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులను కూడా ఇతర దేశాల కోసం తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకొన్నామని పేర్కొన్నారు. ఆశీర్వాద్ పైప్స్ సంస్థకు కేటీఆర్ ఆహ్వానం పలికారు. ఈ సంస్థ ద్వారా 500 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్లాస్టిక్ ఉత్పత్తి రంగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని, ఆశీర్వాద్ పైప్స్ వల్ల ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు తెలంగాణకు వస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు.
లూలు 500 కోట్లు
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు లూలు గ్రూపు అధిపతి యూసుఫ్ అలీ ప్రకటించారు. తెలంగాణ నుంచి యూరప్ సహా వివిధ విదేశాలకు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు త్వరలో తమ యూనిట్‌ను ప్రారంభిస్తామని, దీనిపై కొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన చేస్తామని తెలిపారు. ఇందుకు అవసరమైన అనుమతి పత్రాలను మంత్రి కేటీఆర్ ఆయనకు అందజేశారు. తెలంగాణలో కేవలం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోనే కాకుండా భారీ కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి కూడా లూలు గ్రూపు మరిన్ని పెట్టుబడులను పెట్టనున్నట్టు యూసుఫ్ అలీ తెలిపారు. దీని కోసం ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలను ఎంచుకొని ఆయా ప్రాపర్టీల యజమానులతో మాట్లాడుతున్నామని వివరించారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు లూలు గ్రూప్ ముందుకు రావడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో లూలు గ్రూప్ అంతర్జాతీయ స్థాయి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుండటం స్థానిక వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్‌ను మరింత పెంచేందుకు దోహదపడుతుందని అన్నారు. తెలంగాణలో రూ.500 కోట్ల భారీ పెట్టుబడి పెడుతున్న లులూకి ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్‌లో స్విస్‌రీ కార్యాలయం
స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా రంగ సంస్థ స్విస్‌రీ హైదరాబాద్‌లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. స్విస్‌రీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వెరోనికా సాట్టి, ఎండీ పబ్లిక్ సెక్టార్ సొల్యూషన్స్ ఇవో మెం జింగ్నర్ దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమై ఈ విషయాన్ని వెల్లడిరచారు. తెలంగాణలోని నైపుణ్యం గల మానవ వనరులను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. తొలుత 250 మంది ఉద్యోగులతో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత దశలవారీగా ఉద్యోగుల సంఖ్యను పెంచుతామని చెప్పారు. ఈ కార్యాలయం ద్వారా డాటా, డిజిటల్ విభాగాలను బలోపేతం చేయడంతోపాటు ఇన్సూరెన్స్ ఉత్పత్తులను రూపొందించడం, రిస్ మేనేజ్‌మెంట్ లాంటి అంశాలపై పని చేస్తామని వివరించారు.
కీమో ఫార్మా రెండో యూనిట్ ఏర్పాటు
స్పెయిన్‌కు చెందిన బహుళజాతి సంస్థ కీమో ఫార్మా హైదరాబాద్‌లో రూ.100 కోట్లతో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్టు వెల్లడిరచింది. ఆ సంస్థ డైరెక్టర్ జీన్ దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమై ఈ ప్రకటన చేశారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఒక యూనిట్ ద్వారా కార్యకలాపా లను నిర్వహిస్తున్న కీమో ఫార్మా.. త్వరలో మరో యూనిట్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నదని తెలిపారు. 2018లో జీనోమ్ వ్యాలీలో తమ కంపెనీ క్వాలిటీ కంట్రోల్, స్టెబిలిటీ ల్యాబ్స్ విభాగాల్లో కార్యకలాపాలను ప్రారంభించిందని, రెండో యూనిట్ ద్వారా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించ నున్నదని వివరించారు.
ద్వితీయ శ్రేణి నగరాల్లో మీషో సేవలు
భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ సంస్థ ‘మీషో’ హైదరాబాద్‌లో తన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల వ్యాపారులు ఆన్‌లైన్ ద్వారా విక్రయాలు సాగించేందుకు ఈ కేంద్రం తోడ్పడుతుందని మీషో ప్రతినిధులు దావోస్‌లో మంత్రి కేటీఆర్‌కు తెలిపారు.
ఆవిష్కరణలతోనే శీఘ్ర ప్రగతి: కేటీఆర్
భారత్ శీఘ్రంగా అభివృద్ధి చెందాలంటే దేశంలో ఇన్నోవేషన్ కల్చర్ (ఆవిష్కరణల సంస్కృతి) పెరగాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నిత్యం ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి దేశం వేగంగా ముందుకు సాగాలంటే ‘ఇన్నోవేట్, ఇంక్యుబేట్, ఇన్‌కార్పొరేట్’ (3ఐ) అనే సూత్రాన్ని అనుసరించాలని తెలిపారు. ఇన్నోవేషన్ అంటే కేవలం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమే కాదని, మానవ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యకు పరిషారాలు ఇవ్వగలిగే శక్తి అని పేర్కొన్నారు. దావోస్‌లో జరుగుతున్న డబ్లూఈఎఫ్ సమావేశాల్లో భాగంగా భారత స్టార్టప్ రంగంలో అద్భుత విజయాలు సాధించిన ప్రముఖ కంపెనీల వ్యవస్థాపకులతో నిర్వహించిన చర్చా గోష్ఠిలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. దేశంలో స్టార్టప్ ఎకోసిస్టం బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై తన అభిప్రాయాలను పంచుకొన్నారు.
బెంగళూరుతో పోటీ పడతాం..!
దావోస్‌లో పలువురు ప్రముఖులతో సమావేశమవుతూ, మరోవైపు ఇతర రాష్ట్రాల ప్రముఖులతో కూడా మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. కర్ణాటక ఐటీ శాఖ మంత్రి డాక్టర్ అశ్వత్ నారాయణ్‌తో భేటీ అయ్యారు. భారత్‌లో రెండు ప్రధాన టెక్ హబ్‌లుగా బెంగళూరు, హైదరాబాద్ విరాజిల్లుతున్నాయి. వీటిని ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు మేం పరస్పరం పోటీపడతాం, సహకరించుకొంటాం’ అని సమావేశం తరువాత కేటీఆర్ ట్వీట్ చేశారు. దావోస్‌లో కేటీఆర్‌ను కలవడం చాలా ఆనందంగా ఉన్నదని అశ్వత్ నారాయణ్ పేర్కొన్నారు. ‘బెంగళూరు, హైదరాబాద్ ఎల్లప్పుడూ మంచి అనుబంధాన్ని పంచుకుంటాయి. భవిష్యత్తులో మరిన్ని సహకారాల కోసం ఎదురుచూస్తున్నాం’ అని రీ ట్వీట్ చేశారు.